Gaddar : “అమ్మ తెలంగాణమా..ఆకలికేకల గానమా…అమ్మ నీకు వందనాలమ్మా…కమ్మని ప్రేమే నీదమ్మా’ అంటూ తెలంగాణ కరువును, ఆర్తిని, ఆత్మను, ప్రేమను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించిన పాటగాడు, ఆటగాడు..ప్రజాగాయకుడు గద్దర్‌.. ప్రజా యుద్ధనౌకగా అందరి మన్ననలు అందుకున్న ఆయన ఆరు దశాబ్ధాల పాటు తన గళంతో పీడిత, తాడిత, బడుగు, బలహీన, దళిత, బహుజన వర్గాల గొంతుకై ఆడిండు..పాడిండు. చారిత్రక ఉద్యమాలకెన్నింటికో తన గొంతునిచ్చిన గద్దర్ వర్ధంతి నేడు..

“పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలాన్ని ఒడిచిపట్టి పాటలు కై గట్టిండు గద్దర్‌. ఒకపుడు నక్సల్బరీ ఉద్యమానికి ఊపిరిపోసిన గద్ధర్‌ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, దళిత–బహుజన ఉద్యమాలు, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలకు ఆటై, పాటై పానం పోసిండు.దళిత రచయితగా, విప్లవ కవిగా, గాయకుడిగా సుపరిచితుడైన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. నక్సల్బరీ ఉద్యమం మొదలు అన్ని రకాల సామాజిక ఉద్యమాలకు ఆయన పాటనందించాడు. అనారోగ్యంతో బాధపడుతూ 2023 ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు. విప్లవోద్యమంలో భాగమైన ఆయన బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్ పార్టీకి గుర్తుగా తన పేరును గద్దర్ అని పెట్టుకున్నాడు.

గద్దర్ మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్య అనే పేద దంపతులకు 1949లో జన్మించాడు. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత హైదరబాద్‌లో తన ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. 1969లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో యువకుడిగా గుమ్మడి విఠల్‌ రావు చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ భావ వ్యాప్తికోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేయడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని, రాష్ట్ర ప్రత్యేకతను దిగువస్థాయి ప్రజలకు తెలియజెప్పడానికి ఆయన అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న బుర్రకథను ఎంచుకున్నారు. తద్వారా ఆయన పాటలు ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. ఆయన అద్బుత ప్రదర్శనలు చూసిన ప్రముఖ సినిమా దర్శకులు బి.నరసింగరావు ఆయనను స్వయంగా పిలిపించుకుని పాటలు పాడించుకున్నారు. ఆ తర్వాత ఒక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అనేక సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతోనే తొలిసారిగా ఆపరా రిక్షోడా…రిక్షంట నేనస్తా అనే పాట రాశాడు.

Also Read : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీగా సర్‌ కోత?…. 60 లక్షల ఓట్లు ఔట్?

ఇదిలా ఉండగానే విప్లవరచయితల సంఘం ఆధ్వర్యంలో 1972లో జన నాట్య మండలి పేరుతో సాంస్కృతిక వేదిక ఏర్పడింది. ఈ వేదిక ద్వారా పలువురు కవులు, రచయితలు, గాయకులు అందులో భాగమై నాడు పల్లెల్లో సాగుతున్న అరాచకాలు, దళితులపై దాడులు, మూఢనమ్మకాలు, కూలిరేట్ల పెంపు వంటి సమస్యలపై పాటలు పాడుతూ ప్రజలను చైతన్య పరిచేవారు. ఈ క్రమంలోనే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించారు. అలా అయన తొలిసారి కెనరా బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించారు, ఆతర్వాత విమలను పెళ్లి చేసుకున్నారు, ఆయనకు ముగ్గురు పిల్లలు కాగా వారిలో చంద్రుడు 2003లో అనారోగ్యంతో మరణించారు. సూర్యుడు,కూతురు వెన్నెల ఉన్నారు. వెన్నెల ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ఉన్నారు.

ఒకవైపు ఉద్యోగం చేస్తూనే నరసింగరావు నేతృత్వంలో పలు ప్రదర్శనలు ఇచ్చిన గద్దర్ ఆ తర్వాత మా భూమి సినిమాలో సాయుధ పోరాటయోధుడు యాదగిరి పాత్రలో నటించారు. అంతేకాక యాదగిరి పాడిన “బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి” అనే పాటను ఆయనే పాడి, ఆడారు. అది ఎంతో ప్రజాధారణ పొందింది. ఇదిలా ఉండగానే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దళిత, బహుజనులపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుని 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం జననాట్యమండలిలో చేరి తన పాటల ద్వారా జనంలోకి వెళ్లారు. ఆయన పాటలు వందలు, వేలుగా రికార్డయి చరిత్ర సృష్టించాయి. ఈ క్రమంలోనే నాటి పీపుల్స్‌వార్‌ సానుభూతిపరుడిగా ఎన్నో పాటలు పాడారు. ఈ క్రమంలోనే ఆయన నిర్వహించిన వరంగల్‌సభ, నిజాం కాలేజీ సభకు లక్షలాదిగా జనం రావడం గమనార్హం.

కొంతకాలం అజ్ఞాత జీవితం కూడా గడపిన గద్ధర్‌ను నాడు ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అనేక అసాంఘిక శక్తులు గద్దర్‌ను చంపుతామని బెదిరించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అన్నట్లే 1997 ఏప్రిల్ 6న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన అనేక సంవత్సరాల పాటు చికిత్స పొంది తిరిగి ఉద్యమ పాటనే ఎంచుకున్నారు. ఒక వైపు ప్రజా సాహిత్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తూనే విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరిచారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో పీపుల్స్‌ వార్‌ పార్టీ గద్దర్, వరవర రావులను తమ ప్రతినిధులుగా ఎంచుకున్నాయి.

మావోయిస్టు ఉద్యమం బలహీనపడినప్పటికీ ఆయన ప్రజాచైతన్య గీతాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన మలి తెలంగాణ ఉద్యమంలో భాగమై తన గళాన్ని వినిపించారు.ఆయన రాసిన పాటలే కాకుండా పలువురు కవులు పాటలు పాడి మెప్పించారు. అందులో “బండెనుక బడ్డికట్టి పదహారు బండ్లుకట్టి, భద్రం కొడుకో కొంరన్నజర, భారతదేశం భాగ్యసీమరా, మదనసుందరి, సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మా’ దళితపులులమ్మా, అడవితల్లికి దండాలో , మల్లెచెట్టుకు పందిరివోలె, అమ్మా తెలంగాణమా ఆకలికేకల గానమా? నాసకింద నీస కింద’ వంటి పాటలతో జనం గొంతుకై నిలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జై బోలో తెలంగాణ సినిమా కోసం ఆయన పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా… పోరు తెలంగాణమా..’ అనే పాట మలి తెలంగాణ ఉద్యమానికి మరింత శక్తినిచ్చింది. ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రజా ఫ్రంట్ ను స్థాపించి ముందుకు సాగారు.

తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక పలు సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపించిన గద్ధర్‌ చివరి సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కలిసి కొంతకాలం పనిచేశారు. ఆయన కుమారుడు సూర్యం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తన పాట, ఆట, మాట ద్వారా ప్రజా ఉద్యమాలెన్నింటికో ఊపిరిపోసిన గద్దర్‌ అనారోగ్యంతో బాధపడుతూ 2023 ఆగస్టు 6న అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన జ్ఞాపకార్థం రాష్ర్ట ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా చిత్రపరిశ్రమకు చెందిన పలు విభాగాలకు “తెలంగాణ గద్దర్‌ ఫిలిం అవార్డుల’పేరుతోగద్దర్‌ పురస్కారాలు అందజేస్తూ ఆయనను స్మిరించుకుంటోంది. పాటకు ప్రాణం పోసి, ఆటకు నాట్యం నేర్పి, మాటను తూటగా మలిచి ప్రజా ఉద్యమాలకు జీవం పోసిన గద్దర్‌ చిరస్మరనీయుడు.

Also Read : బీఆర్‌ఎస్‌ క్షుద్రపూజలు చేస్తోంది : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.