
Municipal Elections : రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మిగిలిన పట్టణ మున్సిపల్ సంస్థలకు ఈ డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పలు మున్సిపల్ పాలకమండళ్ల కాలపరిమితి ముగియడం, ఎన్నికలు త్వరితగతిన నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రెండోదశ పురపాలక ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అక్టోబర్ నాటికి పూర్తికానున్న నేపథ్యంలో డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కాలపరిమితి ముగిసిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, అప్పటికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గ కాలపరిమితి ముగియనందున ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేదు.
Also Read : భద్రాచలం ఎమ్మెల్యే పీఏ వసూళ్ల దందా.. ఉద్యోగాలిప్పిస్తానని రూ.కోట్లతో పరారీ
జీహెచ్‌ఎంసీతోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా ఆ సమయంలో ఎన్నికలు జరుగలేదు. వాటితో పాటు కాలపరిమితి ముగియకపోవడంతోపాటు కొన్ని కోర్టు కేసులు ఇతర కారణాలతో మందమర్రి, మణుగూరు, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరగలేదు. వీటితో పాటు కొన్ని డివిజన్లలో కూడా ఎన్నికలు జరుగాల్సి ఉంది. అయితే, ఉమ్మడిగా ఉన్న జీహెచ్‌ఎంసీని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. నిజానికి కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పేరిట ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియ వల్ల మరికొంత ఆలస్యమైంది. అయితే ఈ ప్రక్రియ అక్టోబర్‌లో ముగియనుండటంతో డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియ అక్టోబర్ 19 నాటికి పూర్తికానుంది. ఒకవేళ క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్, పరిష్కారాలకు గడువు పెంచినా అక్టోబర్ 31 నాటికి ‘సర్’ ముగించాలి. ఆ తర్వాత రాష్ట్రంలో తుది ఓటరు జాబితా వెలువడనుంది. ఆ తర్వాతే అంటే కొత్త ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ నాటికి ఎండలు, వర్షాల తీవ్రత తగ్గడంతోపాటు తాగునీరు, విద్యుత్తు సమస్యలు తక్కువగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అప్పుడే ఎన్నికలకు వెళ్లడం మంచిదని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ఎన్నికలు నిర్వహించకపోతే, కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీంతో డిసెంబర్ అనువైన సమయమని యోచిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ వర్గాలు, అధికారులు ఎన్నికల నిర్వహణ దిశగా కార్యాచరణ చేపడుతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో రెండో దశ పుర పాలక ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు కూడా వెళ్లాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లిన తరహాలోనే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికలకు సన్నాహాలు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించినట్లు తెలిసింది. హైదరాబాద్, మేడ్చల్ మినహాయించి రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్‌లు, 565 మండల పరిషత్‌లకు ఒకేదఫాలో ఎన్నికలు జరుపాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : పాకిస్థాన్ అనుకూల వ్యక్తులతో రేవంత్‌కు పనేంటీ?.. మంత్రి కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్









