
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో సభలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
అసెంబ్లీలోకి తమను అనుమతించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పోలీసులను కోరారు. అయితే నల్ల టీషర్ట్‌తో లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో హరీశ్ రావు తన టీషర్ట్ తీసేసి బనియన్‌తోనే అసెంబ్లీ గేటు వద్ద నిరసన తెలిపారు. ఆ తర్వాత బనియన్‌తోనే సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో హరీశ్ రావు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కిందపడిపోయారు. హరీశ్ రావు చేతిపై పోలీసులు కాలు తొక్కారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే కేటీఆర్‌కు కూడా తోపులాటలో గాయాలయ్యాయని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆయన ముఖం, చేతికి గాయాలైనట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు మెడ పట్టుకుని నెట్టేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తన చీరను పోలీసులు లాగారని చెబుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా పోలీసులు ఇలా వ్యవహరించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లడంలో తప్పేముందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసనగా వెళ్లేందుకు ప్రయత్నించామని వారు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు తమను అడ్డుకుని అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు
సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకోవడంతో పోలీసులపై విరుచుకుపడ్డ కేటీఆర్ https://t.co/mCFRw3CbdE pic.twitter.com/q5VODZEG9R
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేవలం తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహిస్తే కుదరదని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరిగేలా స్పీకర్ చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించిన ఏడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ సమస్యపై ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, వారి తరఫున కూడా బీఆర్ఎస్ గొంతు విప్పుతుందని అన్నారు. అలాగే 22A పేరుతో జరుగుతున్న కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని కేటీఆర్ తెలిపారు.
మరోవైపు మంత్రి పదవి నుంచి ఇటీవల తొలగించబడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల మొత్తం కాలానికి ఆమె దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై ఆమె నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.









