Hyderabad : బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. చోరీకి గురైన ఆయుధాలను నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లి గుంత తీసి పాతిపెట్టినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 31న మద్రాస్‌ రెజిమెంట్‌లోని ఆయుధాగారంలో ఆయుధాలు కనిపించకుండా పోయాయి. పిస్టల్స్‌, రైఫిళ్లు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌ చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై బ్రిగేడియర్‌ ఫిర్యాదు చేయడంతో బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

తొలుత ఆయుధాగారంలోకి ఎవరెవరు వెళ్లగలరు అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆర్మ్స్‌ కోట్‌ ఇన్‌ఛార్జ్‌ వినోద్‌కుమార్‌, ఆమ్యునేషన్స్‌ కోట్‌ ఇన్‌ఛార్జ్‌ బల్లి మధుతో పాటు పలువురు సిబ్బందిని ప్రశ్నించారు. అయితే వారిపై అప్పట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు చెందిన టీపీఎస్‌ రావు, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన మల్లేష్‌ అలియాస్‌ రాజుపై పోలీసులు దృష్టి పెట్టారు.

Also Read : నిరుద్యోగులకు మంత్రి ఉత్తమ్ బంపరాఫర్.. 250 కంపెనీల్లో 3 వేల జాబ్స్.. వివరాలివే!

మల్లేష్‌ కదలికలపై పోలీసులు ప్రశ్నించగా.. అతడు సరైన వివరాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విచారణకు రావాలని పిలిచినా మొదట రాలేదు. అతడి ఫోన్‌ కాల్‌ లిస్ట్‌, వాట్సప్‌ చాటింగ్‌లు కూడా డిలీట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ సమయంలో మల్లేష్‌ భయపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు తీవ్రతను అతడి భార్యకు వివరించారు. ఆమె గట్టిగా ప్రశ్నించడంతో మల్లేష్‌ చివరకు అసలు విషయం చెప్పినట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

చోరీ చేసిన ఆయుధాలను నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లిన మల్లేష్‌.. అక్కడ గుంత తీసి వాటిని పాతిపెట్టినట్లు విచారణలో చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆయుధాలను బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బయట వ్యక్తుల కంటే రెజిమెంట్‌లో పనిచేసిన వారిపైనే మొదటి నుంచీ అనుమానం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఆయుధాగారంలోకి సాధారణంగా బయట వ్యక్తులకు అనుమతి ఉండదని అధికారులు గుర్తించారు. దీంతో ఈ చోరీ లోపలివారి సహకారంతోనే జరిగిందనే కోణం బలపడింది.

ప్రాథమిక వివరాల ప్రకారం నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, ఆరు 9 ఎంఎం పిస్టళ్లు, ఒక 6.35 బోర్‌ పిస్టల్‌, మ్యాగజైన్లు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లు, నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌ చోరీకి గురయ్యాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు, ఆర్మీ అధికారులు కలిసి దర్యాప్తు చేపట్టారు. మిలిటరీ ఇంటెలిజెన్స్‌ కూడా విచారణలో చేరింది. సీసీటీవీ ఫుటేజీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది వివరాలు, ఆయుధాల లెక్కలను పరిశీలించారు. తర్వాత అనుమానితుల సంఖ్య పెరిగింది. ఆర్మీకి చెందిన పలువురు సిబ్బందిని ప్రశ్నించారు.

Also Read : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.