Telangana :  బీసీ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తెచ్చింది. అదే ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు. ఈ పథకాన్ని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ మహిళలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కోచోట 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లుగా మంత్రి చెప్పుకొచ్చారు. ఒక్కో కుట్టు మిషన్ ఖరీదు 12 వేల రూపాయలు కాగా, లబ్ధిదారులపై ఎలాంటి భారం పడకుండా నూటికి నూరు శాతం సబ్సిడీతో వీటిని అందిస్తారు.

ఈ కుట్టు మిషన్ల కోసం అర్హులైన బీసీ మహిళలు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. పేదరికం ఎక్కువగా ఉన్నవారు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులు, కుట్టు పని వచ్చిన వారికి ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉంటుందని, అంతేకాకుండా కుట్టు మిషన్లు ఎలా వాడాలో మహిళలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఈ కుట్టు మిషన్ల ద్వారా వారు ఇంట్లోనే ఉంటూ సొంతంగా సంపాదించుకునేలా అండగా నిలుస్తోందని మంత్రి చెప్పారు.

ఇక మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ రెండు కార్యక్రమాలకు బీసీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.