
Telangana Police Recruitment : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు శాఖతో పాటు అనుబంధ విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) ఏకంగా నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సివిల్, ఏఆర్ (AR), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక , జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీర్ఘకాలంగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది.
Application Dates 2026 Press Note dated 29-07-2026
శాఖల వారీగా ఖాళీల వివరాలు
విడుదలైన నోటిఫికేషన్ల ప్రకారం అత్యధికంగా సివిల్ విభాగంలో 3,697 కానిస్టేబుల్ పోస్టులు, ఏఆర్ (AR) విభాగంలో 1,052 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) పరిధిలో 44 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), 1,380 కానిస్టేబుల్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు అగ్నిమాపక (ఫైర్) శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్‌ఫైటర్ పోస్టులతో పాటు జైళ్ల శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించి మరో 223 ఖాళీలను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు నియామక మండలి స్పష్టం చేసింది.
Also Read : మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు.. ట్విస్ట్ ఏంటంటే?
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు, ముఖ్య నిబంధనలు
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్‌లైన్ మార్గం మినహా ఇతర ఏ రూపంలోనూ దరఖాస్తులను అంగీకరించబోరని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ సమయాన్ని ఆదా చేసుకోవడానికి, చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు నిర్ణీత గడువులోపే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Also Read : LRS గడువు పెంపు.. మరో నాలుగు నెలలు టైమ్ !
అభ్యర్థులకు పోలీసు మండలి కీలక సూచనలు
దరఖాస్తు చేసుకోవడానికి ముందే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న వైద్య (Medical), శారీరక ప్రమాణాలను (Physical Standards) క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని పోలీసు నియామక మండలి ప్రత్యేకంగా సూచించింది. ఎత్తు, ఛాతీ కొలతలు ,దృష్టి లోపాలు వంటి అంశాల్లో బోర్డు విధించిన అర్హత నిబంధనలకు అనుగుణంగా ఉన్నామో లేదో సరిచూసుకున్న తర్వాతే ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపాలని తెలిపింది. శారీరక దారుఢ్య పరీక్షలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తగిన మైదాన శిక్షణను ప్రారంభించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.









