
Telangana SIR : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల దాఖలు, సేకరణ గడువును భారత కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరోసారి పొడిగించింది. క్షేత్రస్థాయిలో ఓటర్ల సమాచారాన్ని పక్కాగా, అత్యంత పారదర్శకంగా నవీకరించేందుకు వీలుగా ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించే సమయాన్ని ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) బి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో ఓటర్ల డేటాను సమగ్రంగా సేకరించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో తొలుత జులై 24వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. అయితే క్షేత్రస్థాయి పరిశీలన, ఓటర్ల స్పందన,డిజిటలైజేషన్ ప్రక్రియను పరిగణనలోకి తీసుకుని అధికారులు ఆ తేదీని మొదట ఆగస్టు 3 వరకు పొడిగించారు. తాజాగా క్షేత్రస్థాయి పనిని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయడానికి ఆగస్టు 3 నుండి ఆగస్టు 10కి మారుస్తూ ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,60,88,334 మంది ఓటర్ల ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నమోదైంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా 77.12 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఈసీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడమే ధ్యేయంగా సిబ్బంది ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
Also Read : భారీ వర్షాలతో నదుల ఉగ్రరూపం..భద్రాచలం వద్ద మొదటి ప్రమాదహెచ్చరిక జారీ
జిల్లాల వారీగా పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా 94.25 శాతంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దానితో పాటు జనగామ (91.44%), మెదక్ (90.52%), సూర్యాపేట (90.35%), మహబూబాబాద్ (90.08%) జిల్లాలు 90 శాతానికి పైగా డిజిటలైజేషన్‌ను పూర్తి చేసుకుని అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాయి.గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ పరిధిలోని ప్రధాన నగర, మహానగర ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగుతోంది. నివాసాలు మారడం, అద్దె ఇళ్లలో ఉండటం వంటి కారణాల వల్ల హైదరాబాద్ జిల్లాలో 56.31 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 61.37 శాతం,రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం మాత్రమే నమోదు పూర్తయింది. కాగా సంగారెడ్డి జిల్లాలో 78.01 శాతం నమోదయ్యాక, పట్టణ ప్రాంతాలలో పనులను వేగవంతం చేసేందుకే ఆగస్టు 10 వరకు సమయం పొడిగించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నూతన కాలపట్టిక ప్రకారం ఆగస్టు 17న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ ముసాయిదా జాబితాపై ఓటర్ల నుంచి అభ్యంతరాలు, మార్పులు చేర్పుల దరఖాస్తులను స్వీకరించడానికి ఆగస్టు 17 నుండి సెప్టెంబరు 16 వరకు వ్యవధి కల్పించారు. వచ్చిన వినతులను అధికారులు అక్టోబరు 15 నాటికి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు.అన్ని అభ్యంతరాల పరిష్కారం,మార్పుల అనంతరం సవరించిన తుది (ఫైనల్) ఓటర్ల జాబితాను అక్టోబరు 18 లేదా 19వ తేదీన అధికారికంగా ప్రచురిస్తారు. ఈ సమగ్ర సవరణ ద్వారా ఎటువంటి తప్పులు లేని పక్కా ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది.
ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓ (BLO)లు ప్రతి ఇంటికీ తిరిగి ఫారాలను సేకరిస్తున్నారు. ప్రజలు అందించిన ఫారాలను, 2002 నాటి పాత ఓటర్ల జాబితా ఆధారంగా ప్రత్యేక యాప్‌లో సరిచూస్తూ డిజిటలైజ్ చేస్తున్నారు. తమ ఓటు హక్కు భద్రంగా ఉండటానికి అర్హులైన పౌరులందరూ పూర్తి చేసిన సర్వే ఫారాలను ఆగస్టు 10వ తేదీలోగా తమ పరిధిలోని బిఎల్ఓలకు అప్పగించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Also Read : పోటెత్తుతున్న గోదావరి, కృష్ణమ్మ: తెలంగాణ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు!









