PCC Chief Mahesh Goud
PCC Chief Mahesh Goud

Mahesh Kumar Goud : రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేని బీఆర్‌ఎస్‌ క్షుద్రపూజలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు పడొద్దని, పంటలు పండద్దని బీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు పన్నారని, ప్రజలు కరువుతో అల్లాడిపోవాలని కుతంత్రాలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే  హరీష్ రావు క్షుద్రపూజలు చేశాడనేందుకు తమవద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. హరీష్ రావుకు స్వార్థం పరాకాష్టకు చేరుకుందని, ఆయన రోజురోజుకూ పశుపతిలా ప్రవర్తిస్తున్నారని మహేష్‌ కుమార్ విమర్శించారు. అందువల్లే తమ పార్టీ నాయకులు సామా రామ్మోహన్, దయాకర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ మేరకు గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు.

Also Read : నైరుతి తుఫాను ధాటికి ముంచెత్తిన వానలు: తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ

ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు తిరుచ్చి, శివమొగ్గలోని ఆలయాలకు వెళ్లారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి, శివమొగ్గ తదితర  ప్రాంతాల్లో క్షుద్రపూజలు, తాంత్రిక పూజలు చేసే దేవాలయాలున్నాయన్న మహేశ్‌ గౌడ్‌, జూన్ 1, మే 31, జులై 23న అక్కడికి హరీష్ రావు వెళ్లారన్నారు. దానికి తమకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అబద్ధమైతే తాము చెప్పిన తేదీల్లో హరీష్ రావు ఎక్కడున్నారో మీడియాకు వివరించాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి వెళ్తే మీడియాతో మాట్లాడడం, సోషల్‌ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడం చేసే హరీష్‌రావు శివమొగ్గలో మీడియాతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి జరగకూడదని బీఆర్‌ఎస్‌ నేతలు క్షుద్రపూజలు చేయించడం ఎంతవరకూ సబబు ? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అఘోర, తాంత్రిక పూజలు చేయిస్తోందని మహేష్‌ గౌడ్‌ తీవ్రంగా ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్రపూజలు చేయిస్తున్నారంటే గతంలో నమ్మలేదని.. ఇప్పుడు హరీష్ రావును చూస్తోంటే ఆ అనుమానాలు నిజమేననిపిస్తోందన్నారు.

రాష్ట్రంలో ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందన్న మహేష్‌ గౌడ్, బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేండ్లకాలంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అందువల్లే ఆ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా క్షమించాలని తెలంగాణ ప్రజలను ఆ పార్టీ కోరాలన్నారు.

Also Read : ఎల్పీజీ వినియోగదారులకు ‘ఈ-కేవైసీ’ గండం…ఆ పని చేయకపోతే గ్యాస్ కనెక్షన్ కట్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.