
HIV : పసిఫిక్ దేశం ఫిజీలో హెచ్ఐవీ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జాతీయ స్థాయి హెచ్ఐవీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. డ్రగ్స్ వినియోగం, ముఖ్యంగా ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం పెరగడం కూడా వైరస్ వ్యాప్తికి ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు.
10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ఫిజీలో ప్రస్తుతం ప్రతి 60 మంది పెద్దల్లో ఒకరు హెచ్ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ కొత్త కేసులు తగ్గుతున్న సమయంలో ఫిజీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ఫిజీ ప్రభుత్వం 2025 జనవరిలో తొలిసారిగా హెచ్ఐవీ వ్యాప్తిని ప్రకటించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడంతో పరిస్థితి తీవ్రత బయటపడింది. 2025లో దేశంలో 2,060 కొత్త హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తోందని, వెంటనే సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వ్యాప్తి చిన్నారులపై కూడా ప్రభావం చూపుతోంది.
Also Read : నేడు మోదీ బర్త్‌డే.. ఆయన పేరుతో ఉన్న కీలక రికార్డులివే!
ఐదేళ్ల క్రితం ఫిజీలో ప్రతి 167 మందిలో ఒకరికి హెచ్ఐవీ ఉన్నట్లు అంచనా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఇదే సమయంలో ఫిజీ అమెరికా నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు అక్రమంగా తరలించే మాదకద్రవ్యాలకు కీలక మార్గంగా మారింది. దీంతో దేశంలో ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే డ్రగ్స్ వినియోగం ఒక్కటే హెచ్ఐవీ వ్యాప్తికి కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, కండోమ్‌ల వినియోగం తక్కువగా ఉండటం, ఒకరికి మించి లైంగిక భాగస్వాములు ఉండటం, హెచ్ఐవీ పరీక్షలు అందుబాటులో లేకపోవడం, వ్యాధిపై ఉన్న భయం, సామాజిక వివక్ష వంటి కారణాలు కూడా కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి.
ఫిజీలో 2025లో హెచ్ఐవీ సంబంధిత కారణాలతో 117 మంది మరణించారు. 2021లో ఈ సంఖ్య 25గా ఉండగా.. నాలుగేళ్లలో భారీగా పెరిగింది. ఫిజీలో ప్రతి 50 మంది గర్భిణుల్లో ఒకరికి హెచ్ఐవీ ఉన్నట్లు ఆరోగ్య మంత్రి లలబలావు తెలిపారు. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆందోళన పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ కొత్త కేసులు తగ్గుతున్న సమయంలో ఫిజీలో మాత్రం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2010 నుంచి 2025 మధ్య ప్రపంచవ్యాప్తంగా కొత్త హెచ్ఐవీ కేసులు సుమారు 42 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో సుమారు 78 శాతం మంది చికిత్స పొందుతుండగా.. ఫిజీలో ఈ సంఖ్య కేవలం 22 శాతంగా ఉంది. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఫిజీకి మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.
Also Read : ఇరాన్‌పై భారీ ఆపరేషన్‌కు స్కెచ్.. అమెరికా, ఇజ్రాయెల్‌తో 7 అరబ్ దేశాల భేటీ!









