Heavy Rains in Nepal : నేపాల్‌లో ఇటీవల ఆకస్మాత్తుగా వచ్చిన వరదల మూలంగా వేలాది మంది మరణించగా, ఇంకా అనేక వేలమంది జాడ తెలియకుండా పోయింది. ఇప్పటికీ అక్కడ గల్లంతయినవారి కోసం రెస్క్యూ ఆఫరేషన్‌ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే నేపాల్‌లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. భారీ వర్షాలతో నదుల్లోని నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేపాల్ ప్రభుత్వ వర్గాలు హెచ్చరిక జారీ చేశాయి. ముఖ్యంగా దేశంలోని మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం సింధూలి జిల్లాలోని సన్ కోషి, గూర్ఖాలోని బుధి గండకి, దడెల్దురాలోని మహాకాళి నదుల్లో నీరు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని నేపాల్ జలవిజ్ఞాన, వాతావరణ, వరద అంచనా విభాగం తెలిపింది.

అలాగే లామ్‌జుంగ్ జిల్లాలోని మార్సాంగ్డి, భుకుండేబేసి నీటిమట్టం పర్యవేక్షణ కేంద్రంలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిని మించిందని అధికారులు వెల్లడించారు. ఈ నదుల్లో నీటి మట్టం పెరగడం వల్ల వరద ముప్పునకు ఆస్కారం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అవసరమైతే ఆ ప్రాంతం నుంచి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. రుతుపవనాల నేపథ్యంలో కొంతకాలం పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరో వైపు ఇటీవల నేపాల్‌లో వచ్చిన మెరుపు వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాల కింద చిక్కుకు పోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తు్న్నాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.