– RAVI PRAKASH

Nepal Floods : నేపాల్‌లో భారీ విపత్తు జరిగి ఇవాళ్టికి ఐదో రోజు. అయితే.. గంటలు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త వీడియోలు బయటకు వస్తున్నాయి. కొన్ని వీడియోలు చూస్తే భయమేస్తుంది.. కొన్ని వీడియోలు చూస్తే.. అసలు ఇలా ఎలా జరిగిందో అర్థం కాదు.వీటిలో ఫుల్ పాపులర్ అయిన ఒక వీడియోలో ఓ చిన్న ఇల్లు కనిపిస్తోంది. అది పచ్చ రంగులో ఉంది. ఇంట్లో ఐదారుగురు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ ఆ ఇంటి చుట్టూ పరిస్థితి ఎలా ఉందో చూడండి. నాలుగు వైపులా వరద విలయ తాండవం చేస్తోంది. అదికూడా మామూలు వేగంతో కాదు.. చాలా వేగంగా ప్రవహిస్తోంది. చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం అప్పటికే నీటిలో మునిగిపోయింది. కానీ, అంత వరద వచ్చినా.. ఆ ఇల్లు మాత్రం కొట్టుకుపోకుండా అలాగే ఉంది.

Also Read : డార్క్ వెబ్‌లో ఉగ్ర కుట్ర.. అశ్లీల సైట్లు, సీక్రెట్ యాప్‌లతో పాక్ ISI డర్టీ గేమ్!

ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఒకటే ప్రశ్న. అసలు ఆ కుటుంబం ఎలా ఉంది? వాళ్లు బతికారా? వరదలో ఆ ఇల్లు కొట్టుకుపోయిందా? వాళ్లు బయట పడ్డారా? లేదా ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారా? ఎందుకంటే.. ఇంత భారీగా వరద వస్తుంటే.. చుట్టూ ఉన్నదంతా కొట్టుకుపోతుంటే.. అంత వరద వచ్చినా.. ఆ ఇల్లు ఎలా నిలబడిందనేదే అందరి అనుమానం. కొన్ని గంటల తర్వాత మరో వీడియో వచ్చింది. అదే ఇల్లు.. అదే ప్రదేశం. కానీ ఈసారి మంచి వార్త. ఇల్లు అలాగే ఉంది.. అందులో ఉన్న కుటుంబం కూడా సురక్షితంగా ఉంది. ఇంత పెద్ద వరద వచ్చినా.. ఆ కుటుంబం మాత్రం సురక్షితంగా బయటపడింది.

అయితే..ఇది కేవలం మొదటి వీడియో మాత్రమే. నేపాల్‌ నుంచి ఇలాంటి దిగ్భ్రాంతికరమైన వీడియోలు ఇప్పటికీ చాలా బయటకు వస్తున్నాయి. ఎక్కడో ప్రాణాలు దక్కించుకున్నవాళ్లు..! మరికొన్ని చోట్ల కనీవినీ ఎరుగని నష్టం…! ఇంకొన్ని వీడియోల్లో వరద ఎంత వేగంగా వచ్చిందో చూస్తేనే అర్థమవుతోంది. మరి.. ఇంత భారీగా వరద రావడానికి కారణం ఏంటి? నేపాల్‌లో అసలు ఏం జరిగింది? ఇది కేవలం హఠాత్తుగా వచ్చిన వరద మాత్రమేనా? లేదా దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

వైరల్ అవుతున్న మరో వీడియో కేవలం 25 సెకండ్లే. కానీ.. ఆ 25 సెకండ్లలో ఏం జరిగిందో చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. భారీగా నీరు.. దాంతో పాటు మట్టి, రాళ్లు, శిథిలాలు ఒక్కసారిగా దూసుకొస్తున్నాయి. ఈ ఘటనలో సుమారు 70 నుంచి 80 మంది చనిపోయి ఉండొచ్చని ఈ వీడియోతో వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆలోచించే సమయం లేదు. పరుగెత్తడానికి సమయం కూడా ఇవ్వలేదు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే.. అంతా జరిగిపోయింది. నీరు, మట్టి, శిథిలాలు… ఇలా అన్నీ కలిసి ఒక పెద్ద గోడలా దూసుకొచ్చాయి. కేవలం కొన్ని సెకండ్లలోనే అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడే ఆ వరద తీవ్రత ఎలాఉందో అర్థమవుతుంది. ఇది నెమ్మదిగా నీరు పెరగడం కాదు. ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, శిథిలాలు దూసుకొచ్చి.. దారిలో కనిపించిన ప్రతిదాన్ని తనతో పాటు తీసుకెళ్లింది. ఇక తర్వాతి వీడియోలో పరిస్థితి మరింత భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి వరద.. మనుషుల మీదకు ఎలా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తుంది.ఇక మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : భారతీయులకు ఉజ్బెకిస్థాన్ గుడ్‌న్యూస్.. 30 రోజులు వీసా లేకుండానే వెళ్లొచ్చు!

ఈ వీడియోతో అసలు ఏం జరిగిందన్న దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే.. వరద తనవైపు దూసుకొస్తున్నా ఓ ఆ వ్యక్తి వీడియో తీస్తూనే ఉన్నాడు. దీంతో.. అతను బతికాడా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. కొంతమంది ఇదే అతని చివరి వీడియో అయి ఉండొచ్చని కూడా అన్నారు. నీరు ఎంత వేగంగా వస్తోంది. దాంతో పాటు మట్టి, శిథిలాలు కూడా కొట్టుకొస్తున్నాయి. చూస్తుండగానే అక్కడి పరిస్థితి మొత్తం మారిపోయింది. దీంతో అందరికీ ఒకటే అనుమానం వచ్చింది. ఈ వీడియో తీసిన వ్యక్తి బతికాడా? అతను చనిపోయి ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. కానీ.. తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ వ్యక్తి నిజంగానే వరదలో చిక్కుకున్నాడు. కొంతసేపు అతని పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన నెలకొంది. కానీ చివరకు.. హెలికాప్టర్ వచ్చి అతడిని కాపాడింది.

మరో వీడియో దూరం నుంచి తీసిన వీడియో కాదు. ఓ కెమెరా పట్టుకున్న వ్యక్తి.. వరద మధ్యలో చిక్కుకుపోయాడు. వరద అతని వైపు దూసుకొస్తోంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం… అతను పరుగెడుతున్నాడు. ఓ వైపు వెంటాడుతున్న వరద.. మరోవైపు ప్రాణభయంతో పరుగుతీస్తోన్న బాధితుడు.. వెన్నులో వణుకుపుట్టించేలా ఉన్న… మరో వీడియో చూస్తే… అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఒకవైపు భయం.. మరోవైపు గందరగోళం… ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. అతను ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెడుతూనే… వెనకాల వస్తున్న వరదను వీడియో తీస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ వీడియో తీసిన వ్యక్తికి ఆ తర్వాత ఏమైందో మాత్రం తెలియదు. అతను వరద నుంచి బయటపడ్డాడా లేదా అన్నదానిపై కూడా స్పష్టత లేదు. కాబట్టి.. మనకు తెలియని విషయం గురించి ఏదీ ఊహించకూడదు. కానీ ఈ వీడియో చూస్తే… వరద వేగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
ఇక మరో వీడియోలో ఈసారి ఓ యువ జంట కనిపిస్తోంది. వాళ్లు సరదాగా వీడియో తీసుకుంటున్నారు. కానీ.. తమ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్లకు అప్పటికీ తెలియదు. ఆ వీడియో వ్యవధి కేవలం 23 సెకండ్లు. కానీ.. ఆ వీడియో తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హఠాత్తుగా వచ్చిన వరద తర్వాత ఈ జంట కనిపించకుండా పోయిందని నివేదికలు వచ్చాయి.

వీడియో మాత్రం ఉంది. కానీ.. వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. అయితే.. ఇలాంటి విషయాల్లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ యువ జంట వరదలో చిక్కుకుని చనిపోయారని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారిత సమాచారం లేదు. కానీ.. ఈ వీడియోలో సంతోషంగా కనిపించిన ఆ ఇద్దరూ ఆ తర్వాత కనిపించకుండా పోయారన్న విషయం మాత్రం బాధ కలిగిస్తోంది. ఎందుకంటే.. ఈ విపత్తుకి సంబంధించిన ప్రతి వీడియో వెనుకా ఒక మనిషి కథ ఉంది. అది ఓ కుటుంబం కావచ్చు.. ఓ జంట కావచ్చు.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తుతున్న ఓ వ్యక్తి కావొచ్చు… ఎక్కడో ఓ కుటుంబం.. తమ వాళ్లు తిరిగి వస్తారని ఎదురుచూస్తూ ఉండొచ్చు. అందుకే.. ఇవి కేవలం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలు కాదు. ప్రతి వీడియో వెనుకా ఓ మనిషి జీవితం ఉంది. అయితే.. ఇన్ని భయంకరమైన వీడియోల మధ్యలో ఒక మంచి వార్త కూడా ఉంది. ఇప్పుడు అలాంటి కథ గురించే చెప్పబోతున్నా. వరద తగ్గుముఖం పట్టింది. శిథిలాల దిబ్బను మిగిల్చివెళ్లింది. అయితే ఆ శిథిలాల కింద రెండేళ్ల చిన్నారి చిక్కుకుపోయింది. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. మూడ్రోజులపాటు ఆ చిన్నారి ఆచూకీ తెలియలేదు. అయినా రక్షణ బృందాలు వెతకడం ఆపలేదు. చివరకు.. మూడు రోజుల తర్వాత ఆ చిన్నారి ప్రాణాలతో కనిపించడం ఆశ్చర్యం కలిగించింది.

శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆ చిన్నారిని… రక్షణ బృందం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఈ విపత్తులో మరో కోణాన్ని కూడా చూపిస్తున్నాయి. ఒక వీడియోలో విషాదం కనిపిస్తే.. మరో వీడియోలో ప్రాణాలు కాపాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకచోట భారీ నష్టం కనిపిస్తే.. మరోచోట ప్రాణాలతో బయటపడిన వాళ్లు కనిపిస్తున్నారు. అంతా అయిపోయిందనిపించినా.. ఎక్కడో ఒకచోట ఇంకా ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే ఈ విపత్తులో కనిపిస్తున్న మరో ఆశ!

ఇక నేపాల్ ఆర్మీ చేస్తున్న రక్షణ చర్యల వీడియోలో వరద శాంతించింది. వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది. చాలా మంది బాధితులు బురదలో చిక్కుకుపోవడం గమనించారు. మట్టి, శిథిలాలు… వారిని పూర్తిగా చుట్టేయడంతో, బయటకు రావడం వారికి కష్టంగా మారింది. అలాంటి సమయంలో.. అక్కడికి నేపాల్ ఆర్మీ చేరుకుంది. పీకల్లోతు బురదలో చిక్కుకున్న వారందరినీ… ఒక్కొక్కరుగా బయటకు తీసుకొస్తున్నారు. అలాంటి పరిస్థితిలో రక్షించడం అంత సులువు కాదు. తమ ప్రాణాలకు సైతం ప్రమాదం ఉన్నా సరే… అక్కడ చిక్కుకున్నవాళ్లను బయటకు తీసుకొచ్చారు. ఈ దృశ్యాలు చూస్తే.. విపత్తు సమయంలో రక్షణ బృందాలు ఎంత కీలకంగా పనిచేస్తాయో అర్థమవుతుంది. అక్కడ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉన్నా.. వాళ్లను కాపాడటంపైనే నేపాల్ ఆర్మీ దృష్టి పెట్టింది. చివరకు.. అక్కడ చిక్కుకున్నవాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. రక్షణ చర్యల్లో పాల్గొన్న నేపాల్ ఆర్మీకి నిజంగా వందనం చేయాల్సిందే.

సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక్కో వీడియో ఒక్కో కథ చెబుతోంది. చుట్టూ వరద ముంచెత్తినా తట్టుకుని నిలబడ్డ ఓ ఇల్లు ! ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తిన ఓ వ్యక్తి ! వరద తర్వాత కానరాని ఓ జంట ఆచూకీ ! మూడ్రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన రెండేళ్ల చిన్నారి ! మట్టిలో చిక్కుకున్నవాళ్లను కాపాడిన నేపాల్ ఆర్మీ !. ఇవన్నీ నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలు కాదు. ప్రతి వీడియో వెనుక ఒక మానవతా కథ ఉంది. ఈ వీడియోల్లో విషాదం కనిపిస్తోంది.. భారీ నష్టం కనిపిస్తోంది.. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం కనిపిస్తోంది.. అయితే.. కొన్ని చోట్ల ప్రాణాలు దక్కిన ఆనందం కూడా కనిపిస్తోంది.
కానీ ఈ మొత్తం విపత్తు… కొన్ని పెద్ద ప్రశ్నలను అలాగే మిగిల్చి వెళ్లింది. అసలు ఈ విపత్తుకు కారణం ఏంటి? హిమపాతం, రాళ్లు విరిగిపడటం కారణమా? లేదా, తాత్కాలికంగా నీటిని అడ్డుకున్న సహజసిద్ధమైన ఆకస్మిక ఆకట్ట వల్లే ఇదంతా జరిగిందా? అంటే, మంచు సరస్సు పొంగిపొర్లడం లాంటి ఘటన ఏదైనా జరిగిందా? మరోవైపు, వాతావరణ మార్పుల ప్రభావం ఎంత ఉంది? అన్నింటికంటే ముఖ్యంగా.. ఇలాంటి విపత్తులను మనం ముందే గుర్తించే అవకాశం ఉందా? ఎందుకంటే హిమాలయాలు అంటే కేవలం కొండలు కాదు. హిమాలయాలు… కోట్లాది మంది ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నాయి. అంతేకాదు… ఆసియాలోని కీలక నదులకు హిమాలయాలే ప్రధాన ఆధారం. అందుకే నేపాల్‌లో జరిగిన ఈ విపత్తును… ఒక్క నేపాల్‌కు సంబంధించిన ప్రళయంగా మాత్రమే చూడలేం.

ఇది మొత్తం హిమాలయ ప్రాంతానికి ఒక హెచ్చరిక. ప్రకృతి ఎప్పుడు ఒక్కసారిగా మారిపోతుందో మనకు తెలియదు. కానీ.. శాస్త్ర సాంకేతికతల ద్వారా కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే పర్యవేక్షణ మరింత పెరగాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరింత బలంగా ఉండాలి. ముఖ్యంగా.. ఇలాంటి విపత్తులు మళ్లీ వచ్చినప్పుడు ప్రాణనష్టం తగ్గించేలా ముందుగానే వ్యవస్థలన్నీ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు.. ఏ వివరణ కూడా వాళ్లను తిరిగి తీసుకురాలేదు. బతికిన వాళ్లకు మాత్రం… ఆ చేదు జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. చివరిగా.. సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ.. వందనం. నేపాల్‌ విపత్తు ఇక్కడితో ముగిసిపోవచ్చు. కానీ.. ఈ ప్రకృతి ప్రళయం చాలా ప్రశ్నలను మిగిల్చి వెళ్లింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.