India :  మన చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రపంచ పటంలో కొన్ని దేశాలు, ఖండాలు వాటి నిజమైన పరిమాణం కంటే పెద్దగా లేదా చిన్నగా కనిపిస్తాయి. ముఖ్యంగా భారత్ కూడా వాస్తవ పరిమాణం కంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది. దీనికి కారణం భూమి గుండ్రంగా ఉండటమే. గుండ్రంగా ఉన్న భూమిని ఫ్లాట్ మ్యాప్‌లో చూపించేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో పరిమాణంలో తేడాలు వస్తాయి.

ఇప్పటివరకు ఎక్కువగా ఉపయోగించిన మెర్కేటర్ మ్యాప్‌ను 1569లో రూపొందించారు. సముద్రంలో ప్రయాణించే వారికి దిశలు, మార్గాలు సులభంగా తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడేది. అయితే ఈ మ్యాప్‌లో ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు చాలా పెద్దగా కనిపిస్తాయి. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాలు మాత్రం చిన్నగా కనిపిస్తాయి.

Also Read : హోర్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా యుద్దనౌకలపై ఇరాన్ క్షిపణుల దాడి!

దీనికి ఆఫ్రికా, గ్రీన్‌ల్యాండ్ మంచి ఉదాహరణ. మ్యాప్‌లో ఈ రెండూ దాదాపు ఒకే పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ నిజానికి ఆఫ్రికా.. గ్రీన్‌ల్యాండ్ కంటే దాదాపు 14 రెట్లు పెద్దది. రష్యా, కెనడా వంటి దేశాలు కూడా మెర్కేటర్ మ్యాప్‌లో వాస్తవం కంటే పెద్దగా కనిపిస్తాయి.

ఈ తేడాలను తగ్గించేందుకు 2018లో ‘ఈక్వల్ ఎర్త్’ అనే కొత్త మ్యాప్‌ను రూపొందించారు. ఇందులో దేశాలు, ఖండాల అసలు విస్తీర్ణం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మ్యాప్‌లో భారత్ కూడా సాధారణ మ్యాప్‌తో పోలిస్తే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఆఫ్రికా కూడా తన అసలు పరిమాణానికి మరింత దగ్గరగా కనిపిస్తుంది.

అయితే ప్రపంచాన్ని చూపించడానికి పూర్తిగా పర్ఫెక్ట్ అయిన మ్యాప్ ఏదీ లేదు. భూమి గుండ్రంగా ఉండటంతో దాన్ని ఫ్లాట్‌గా చూపించేటప్పుడు ఏదో ఒక విషయంలో తేడా తప్పదు. మెర్కేటర్ మ్యాప్ దిశలకు బాగా ఉపయోగపడితే, ఈక్వల్ ఎర్త్ మ్యాప్ దేశాల అసలు పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి మెరుగ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాప్‌లో భారత్ చిన్నగా కనిపించడం.. నిజంగా భారత్ చిన్నదని కాదు.

Also Read : విరిగిపడిన కొండ చరియలు.. మరోసారి నేపాల్‌కు వరద ముప్పు?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.