
Ukraine : ఉక్రెయిన్‌లో భారతీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పెద్ద ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడిలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉన్న ఈ ఫార్మా ప్లాంట్‌కు భారీ నష్టం జరిగింది. ప్లాంట్‌లోని ప్రధాన భవనం చాలా వరకు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. మృతులు, గాయపడిన వారి సంఖ్య ఇంకా మారే అవకాశం ఉందని చెప్పారు. డ్రోన్లు దాడి చేసిన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పొగ పైకి వస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. దాడి జరిగిన సమయంలో ప్లాంట్ చుట్టుపక్కల ప్రాంతంలో భయానక పరిస్థితి నెలకొంది.
ఈ ఫార్మా ప్లాంట్ భారత్‌కు చెందిన కుసుమ్ గ్రూప్‌కు చెందినది. ఈ సంస్థను భారతీయుడు రాజీవ్ గుప్తా నడుపుతున్నారు. కుసుమ్ గ్రూప్ 1994లో ఉక్రెయిన్‌కు భారతీయ మందులను పంపించే సంస్థగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2002లో ఇతర కంపెనీల మందులను అమ్మడం ఆపి.. సొంత బ్రాండ్ల మందులను మార్కెట్‌లోకి తీసుకురావడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మందుల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. 2007లో భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. 2009లో ఉక్రెయిన్‌లోని సుమీలో మరో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత భారత్‌లో మరో రెండు ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం కుసుమ్ గ్రూప్ 50కి పైగా మందులను తయారు చేస్తోంది. వీటిలో ఎక్కువగా సాధారణంగా ఉపయోగించే మందులే ఉన్నాయి. ఉక్రెయిన్‌తో పాటు ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, ఫిలిప్పీన్స్ సహా తొమ్మిది దేశాలకు పైగా ఈ మందులను విక్రయిస్తోంది. ఈ సంస్థను భారతీయ మూలాలు ఉన్న ఉక్రెయిన్ కంపెనీగా కుసుమ్ గ్రూప్ చెబుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా సుమీ ప్లాంట్ తన కార్యకలాపాలను కొనసాగించింది. అయితే తాజా డ్రోన్ దాడితో ప్లాంట్‌కు భారీ నష్టం జరిగింది. ఈ నష్టం విలువ కనీసం రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. రష్యా దాడిని ఖండిస్తూ ‘ఈ దాడిలో ఒకరు చనిపోయారు. మృతుడి కుటుంబ సభ్యులకు నా సానుభూతి’ అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కీవ్‌లోని పివ్నిచ్నీ వంతెనపై కూడా రష్యా డ్రోన్ దాడి చేసిందని చెప్పారు. డ్నిప్రోలోని ఓ కమ్యూనికేషన్ కేంద్రంపై కూడా దాడి జరిగిందని.. ఈ దాడుల్లో ఆరుగురు గాయపడ్డారని తెలిపారు. ఇటీవలి నెలల్లో రష్యా ఉక్రెయిన్‌పై రోజూ పెద్ద సంఖ్యలో షహీద్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇవి వేగంగా వెళ్లే డ్రోన్లు కావడంతో వాటిని అడ్డుకోవడంలో ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ డ్రోన్లను తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చని సమాచారం. మరోవైపు ఉక్రెయిన్ కూడా తన సొంతంగా తయారు చేసిన ఎఫ్‌పీ-7 బాలిస్టిక్ క్షిపణిని ఈ వారంలో తొలిసారి యుద్ధంలో ఉపయోగించినట్లు ప్రకటించింది. ఈ క్షిపణి సుమారు 250 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదని ఉక్రెయిన్ తెలిపింది.









