Lake Ontario : అమెరికా, కెనడా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం మరో కొత్త మలుపు తిరిగింది. కెనడాలోని అత్యంత జనాభా కలిగిన అంటారియో రాష్ట్రంతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంటారియో సరస్సు పేరును అమెరికా సరస్సుగా మార్చడాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంటారియోతో ఇకపై పెద్దగా వ్యాపారం చేసే అవకాశం లేనందునే ఈ పేరు మార్పు ఆలోచన చేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Also Read : చైనాను తలదన్నేలా ఇండియన్ స్పేస్ సెంటర్.. ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారో తెలుసా?

ఈ భౌగోళిక ప్రాంతం అమెరికా, కెనడా రెండింటికీ చెందింది. ఈ సరస్సు ఉత్తర తీరం కెనడాలోని అంటారియో రాష్ట్రంలో ఉండగా, టొరంటో, కింగ్‌స్టన్ వంటి పెద్ద నగరాలు అక్కడ ఉన్నాయి. అలాగే దీని దక్షిణ తీరం అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రానికి ఆనుకుని ఉంది. కెనడా ఆర్థిక వ్యవస్థలో అంటారియో కీలక పాత్ర పోషిస్తుంది, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఘర్షణలను మరింత పెంచుతోంది.

ఇటీవల వాణిజ్య చర్చలు విఫలం కావడంతో కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా కెనడా కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా కెన్యా వాహనాలు, ఆటో విడిభాగాలు, ఉక్కుపై మరో 50 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ స్పందిస్తూ, అమెరికా వాణిజ్య డిమాండ్లు కెనడా పరిశ్రమలను నాశనం చేసేలా ఉన్నాయని ఆరోపించారు. అమెరికా చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.

ఈ వివాదం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యక్తిగత విమర్శలకు కూడా దారితీసింది. కెనడా ప్రధానిపై ట్రంప్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. అలాగే అంటారియో ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్‌ను కూడా ట్రంప్ విమర్శించగా, ఆయన కూడా తీవ్రంగా స్పందించారు. ఈ సుంకాల పోరు వల్ల అమెరికా, కెనడా దేశాల మధ్య ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతింటుందని, తయారీదారులు, వినియోగదారులపై భారం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం ?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.