ప్రతి ఏటా వర్షాకాలంలో భయం గుప్పిట్లోకి నెట్టే డెంగ్యూ మహమ్మారికి త్వరలోనే అడ్డుకట్ట పడనుంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వల్ల వేలాది మంది ఆసుపత్రుల పాలవ్వడం, ప్లేట్‌లెట్లు పడిపోయి ప్రాణాంతక పరిస్థితులు ఎదుర్కోవడం ప్రతీ సీజన్‌లోనూ చూస్తూనే ఉన్నాం. అయితే భారత వైద్య రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తూ దేశంలోనే మొదటి డెంగ్యూ నివారణ టీకా ‘క్యూడెంగా'(Qdenga) 2027 నాటికి సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి సిద్ధమవుతోంది.

ఈ అద్భుత టీకాను జపాన్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ టకేడా ఫార్మాస్యూటికల్స్ సుదీర్ఘ పరిశోధనల అనంతరం అభివృద్ధి చేసింది. మన దేశంలో ఈ వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ వేగంగా చేరవేసేందుకు విక్రయించడానికి హైదరాబాద్‌లోని దిగ్గజ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ భాగస్వామ్యం వహించనుంది. భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి ఇప్పటికే తుది అనుమతులు లభించడంతో 2027 మొదటి ఆరు నెలల కాలంలోనే ఇది భారత్‌లోని విపణిలోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూని అరికట్టే లక్ష్యంతో 2030 నాటికి ఏటా 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని టకేడా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.

Also Read : యువతకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఒకే రోజు 51 వేల మందికి ఉద్యోగ పత్రాలు!

ఈ క్యూడెంగా వ్యాక్సిన్ డెంగ్యూకు కారణమయ్యే నాలుగు వేర్వేరు రకాల (DENV-1, DENV-2, DENV-3, DENV-4) వైరస్‌ల నుండి మానవ శరీరానికి పూర్తి రక్షణ కల్పిస్తుంది. 4 ఏళ్ల చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ల పెద్దల వరకు ఎవరైనా ఈ టీకాను సురక్షితంగా వేయించుకోవచ్చు. సాధారణంగా కొన్ని రకాల వ్యాక్సిన్లు ఇచ్చే ముందు గతంలో ఇన్ఫెక్షన్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి అనేక రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ టీకా కోసం ఎలాంటి ముందస్తు రక్తపరీక్షలు అవసరం లేదు. దీనిని మూడు నెలల వ్యవధి ఇస్తూ రెండు డోసులలో (0.5 మి.లీ చొప్పున) ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.

వైద్య పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ అద్భుత ప్రతిభను కనబరిచింది. టీకా రెండు డోసులు పూర్తయిన ఏడాది తర్వాత కూడా డెంగ్యూ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా 80.2 శాతం నివారణ సామర్థ్యాన్ని చూపించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత డెంగ్యూ సోకినా.. పరిస్థితి తీవ్రమై ఆసుపత్రిలో చేరాల్సిన ప్రమాదాన్ని ఈ టీకా ఏకంగా 90.4 శాతం వరకు నివారిస్తుంది.

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో డెంగ్యూ భయంతో అల్లాడే కుటుంబాలకు, రోగులతో కిటకిటలాడే ఆసుపత్రులకు ఈ వ్యాక్సిన్ రాక పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. 2027 నాటికి ఈ టీకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, దేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గి వేలాది మంది ప్రాణాలను కాపాడుకోవడానికి వీలవుతుంది.

Also Read : బెంగాల్‌ ఉప ఎన్నికలు.. మమతకు ఈసీ ఫుట్‌బాల్‌ గుర్తు!