రష్యా-ఉక్రెయిన్‌ మధ్య పాటల యుద్ధం(Russian AI Psychological War) మొదలైంది. రష్యా ఓ వినూత్నమైన మైండ్ గేమ్‌కు తెరతీసింది. సరికొత్త కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకుని రష్యా సైనిక చర్యకు అనుకూలంగా వందలాది పాటలను సృష్టించి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ఈ ఏఐ పాటలు కేవలం వినోదం కోసం చేసినవి కావు. శాంతియుతమైన సెంట్ మెలోడీల నుంచి ఉద్వేగం రగిలించే త్రాష్ మెటల్ సంగీతం వరకు రకరకాల శైలుల్లో వీటిని రూపొందిస్తున్నారు.

ఈ పాటలలో ఉక్రెయిన్ పౌరులను, అక్కడి స్థానిక జాతులను కించపరిచే పదాలను వాడటంతో పాటు రష్యా సైనికుల పోరాటాన్ని, త్యాగాలను విపరీతంగా పొగుడుతున్నారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన సైనిక చర్యను తప్పనిసరి ఆత్మరక్షణగా అభివర్ణిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంతే కాకుండా ప్రాచీన సోవియట్ యూనియన్ నాటి యుద్ధ గీతాలకు ఆధునిక ఏఐ ట్యూన్‌లు జోడించి యువతను ఆకట్టుకునేలా రీమిక్స్ చేస్తున్నారు.

ఇప్పటివరకు దాదాపు 981 పాటలను రష్యా యుద్ధ ప్రచారానికి మద్దతుగా కంపోజ్ చేశారు. ముఖ్యంగా సునో, ఉడియో వంటి ఏఐ మ్యూజిక్ టూల్స్ మార్కెట్‌‌లోకి వచ్చాకే ఈ పాటల యుద్ధం తీవ్రమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, డిజెర్ వంటి ప్రముఖ డిజిటల్ మ్యూజిక్ యాప్‌లలో ఈ పాటలు లక్షలాది వ్యూస్ సంపాదిస్తున్నాయి.

Also Read : అమెరికాలో హిందూ ఆలయంపై దాడి.. ఇటుకలతో ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు

వీటిలో ఒక్క ఆర్టిలరీ ఆయుధాలపై తయారు చేసిన ఏఐ పాటనే యూట్యూబ్‌లో ఏకంగా 20 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ తరహా కంటెంట్ వెనుక క్రెమ్లిన్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ప్రభుత్వం దేశభక్తిని పెంచే పేరుతో వందలాది సాంస్కృతిక, కళాత్మక ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తూ ప్రోత్సహిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

సాధారణంగా ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో విద్వేషకరమైన, సమాజాన్ని రెచ్చగొట్టే లేదా హింసను ప్రోత్సహించే పాటలపై కఠినమైన ఆంక్షలు ఉంటాయి. కానీ ఏఐ రూపొందించిన ఈ పాటలు ఆ నిబంధనలకు దొరక్కుండా వేరే రకమైన కోడింగ్ భాషా పదాలను, పరోక్ష అర్థాలను ఉపయోగిస్తున్నాయి. టెక్ కంపెనీల ఆటోమేటెడ్ ఫిల్టర్లు కేవలం కొన్ని నిషేధిత పదాలను మాత్రమే పసిగట్టగలవు తప్ప, పాట వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని లేదా భావాన్ని పసిగట్టలేకపోతున్నాయి.

దీంతో ఈ పాటలు ఎలాంటి అడ్డంకులు లేకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన టెక్ దిగ్గజాలు ఏఐ కంటెంట్‌ను, దాని వెనుక ఉన్న వాటిని గుర్తించే విధానాలపై కఠినమైన ఆంక్షలు విధించేందుకు కసరత్తు ప్రారంభించాయి. సాంకేతికతను ఆయుధంగా మలచుకుని రష్యా చేస్తున్న ఈ పాటల యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read : బాంబ్ పేల్చిన ట్రంప్.. అమెరికా డెడ్ లైన్‌తో దిగొచ్చిన G7 దేశాలు.. ఏకంగా 10 కోట్ల బ్యారెళ్ల ఇంధనం విడుదల!