US-Russia : అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య కుదిరిన ‘డీజిల్ ఒప్పందం’ గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలను అదుపు చేసేందుకు, శాంతి చర్చలను వేగవంతం చేసేందుకు వాషింగ్టన్ దాదాపు 3 లక్షల టన్నుల రష్యన్ డీజిల్‌ను మార్కెట్లోకి అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామం ఉక్రెయిన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించినప్పటికీ, ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు మాత్రం భారీ ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరగడం, ధరలు స్థిరపడటం ద్వారా ఇండియాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read : నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్.. ఇప్పుడు మరో దేశంలో విద్యార్థుల తిరుగుబాటు

భారత్‌కు ఎందుకు భారీ ఊరట?

ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పెరిగితే ముడి చమురు ధరలు నేలచూపులు చూస్తాయి. భారత్ ఇప్పటికే రష్యా నుంచి రాయితీ ధరకు పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు అమెరికా స్వయంగా రష్యన్ డీజిల్ మార్కెట్లోకి రావడానికి అనుమతించడంతో పాటు, రష్యన్ ఆయిల్ సరఫరా చేసే నౌకలపై ఆంక్షల సడలింపును పరిశీలిస్తోంది. దీనివల్ల గ్లోబల్ సప్లై పెరిగి బ్యారెల్ ధరలు తగ్గుతాయి. ఫలితంగా భారత చమురు కంపెనీల దిగుమతి బిల్లు తగ్గి, స్థానిక వినియోగదారులకు ఇంధన ధరల భారం దిగిరానుంది. ద్రవ్యోల్బణం తగ్గి దేశీయ రవాణా ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి.

జెలెన్‌స్కీ వర్సెస్ ట్రంప్: తారాస్థాయికి వివాదం

మరోవైపు ఈ డీల్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ తమకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రష్యాలోని రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఎగబాకుతున్నాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు తక్షణమే ఆపాలని హెచ్చరించినా జెలెన్‌స్కీ వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ ఘాటుగా స్పందించారు. “ఉక్రెయిన్‌కు కొత్త ప్రెసిడెంట్ రావాల్సిన సమయం ఆసన్నమైంది” అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

Also Read : ఇరాన్‌పై ‘Mother Of All Bombs’? అమెరికా ‘MOAB’ వెనుక అసలు కథ

ఉక్రెయిన్‌కు అమెరికా చెక్

మాట వినని ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి పెంచింది. సైనిక కమ్యూనికేషన్లకు ప్రాణవాయువులాంటి స్టార్‌షీల్డ్ (స్టార్‌లింక్) సేవల వేగాన్ని తగ్గించడంతో కీవ్ డ్రోన్ ఆపరేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంటెలిజెన్స్ షేరింగ్, ఆయుధ సరఫరా నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించింది. అటు నిధుల కోసం బ్రస్సెల్స్ వెళ్లిన జెలెన్‌స్కీకి ఈయూ నుంచి కూడా ఆశించిన మేర మద్దతు లభించలేదు. ట్రంప్ వ్యూహం వల్ల యుద్ధరంగంలో జెలెన్‌స్కీ ఒంటరవుతుండగా, అంతర్జాతీయంగా తగ్గుతున్న ఇంధన ధరలు భారత్‌తో సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు సరికొత్త జోష్ ఇస్తున్నాయి.