
ప్రపంచ పటంలో ఎడారి అంటే గుర్తొచ్చే పేరు సౌదీ అరేబియా. కాస్త తవ్వితే చాలు.. నల్ల బంగారంలా పెట్రోల్ పొంగిపొర్లే నేల అది. దశాబ్దాలుగా కేవలం ఈ చమురు ముందేసుకుని ప్రపంచాన్నే శాసించిన సౌదీకి, ఒక నిజం ఆలస్యంగానైనా అర్థమైంది. అదేంటంటే ఈ పెట్రోల్ నిల్వలు శాశ్వతం కావు. ఏదో ఒకరోజు బావులు ఎండిపోతాయి. ఆ తర్వాత దేశం పరిస్థితి ఏంటనే ఆలోచన ఉంది. ఈ ఒక్క ఆలోచనే సౌదీ అరేబియా ముఖచిత్రాన్ని మార్చేసింది. ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం చమురుపైనే ఆధారపడే పరిస్థితికి స్వస్తి పలికి.. సౌదీని ప్రపంచానికే పెట్టుబడుల రాజధానిగా, పర్యాటక కేంద్రంగా మార్చాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆయన కంటున్న ఆ కలల సామ్రాజ్యానికి ఇప్పుడు యెమెన్‌కు చెందిన హూతీ రెబెల్స్ అతి పెద్ద శాపంగా మారారు.
2016లో సౌదీ యువరాజు సల్మాన్ సౌదీ విజన్ 2030 అనే పథకాన్ని ప్రకటించారు. దీని ప్రధాన లక్ష్యం చమురుయేతర ఆదాయాన్ని పెంచుకోవడం. దీనికోసం ప్రభుత్వం తీరును మార్చి.. డిజిటల్ నెట్‌వర్క్‌ను పెంచారు. ఈ ప్రాజెక్ట్‌లకు డబ్బుల కోసం సౌదీకి చెందిన అతిపెద్ద చమురు కంపెనీ ఆరామ్కోను షేర్ మార్కెట్లో ఐపీఓగా తీసుకొచ్చారు. 2019లో వచ్చిన ఈ ఐపీఓ ప్రపంచ రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ దాదాపు 1.7 ట్రిలియన్ డాలర్ల పైనే ఉంది. ఈ కంపెనీ ద్వారా వచ్చిన భారీ లాభాలను, చమురు ఆదాయాన్ని యువరాజు నేరుగా దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మళ్లించారు.
ఎర్రసముద్ర తీరంలో దాదాపు 500 బిలియన్ డాలర్ల వ్యయంతో ఒక అత్యంత ఆధునిక ఫ్యూచరిస్టిక్ నియోమ్ సిటీని నిర్మిస్తున్నారు. సౌదీ ప్రాచీన సంస్కృతి, చరిత్ర ప్రపంచానికి తెలిసేలా దిరియా గేట్ రూపుదిద్దుతున్నారు. రాజధాని రియాద్‌లో ముకాబ్ పేరుతో క్యూబ్ ఆకారంలో ఒక భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది న్యూయార్క్‌లోని ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే చాలా పెద్దది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద భవనంగా చరిత్రకెక్కుతుంది. ఆరోగ్యం, విద్య, పర్యాటకం, వినోద రంగాల్లో సౌదీ సాధిస్తున్న ప్రగతిని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. విజన్ 2030 లక్ష్యాలు అనుకున్నట్లు పూర్తయితే రియాద్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఒక మహా శక్తిగా మారేది.
అన్నీ అనుకున్నట్లు జరుగుతున్నాయి అనుకుంటున్న సమయంలో పొరుగున ఉన్న యెమెన్ నుంచి హూతీ తిరుగుబాటుదారులు సౌదీకి నిద్రలేకుండా చేస్తున్నారు. సౌదీ అరేబియా ఆయువుపట్టుగా ఉన్న ప్రదేశాలపైనే వీరు విరుచుకుపడుతున్నారు. సౌదీకి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలు, ప్రధాన పైప్లైన్లు, చివరికి అంతర్జాతీయ విమానాశ్రయాలపై కూడా హూతీలు బాంబులు, క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తున్నారు. సౌదీ అరేబియా విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం. హూతీలు పంపుతున్న డ్రోన్లను కొన్నింటిని అడ్డుకుంటున్నప్పటికీ దేశం మొత్తాన్ని కవర్ చేసే క్షిపణి రక్షణ వ్యవస్థలు సౌదీ దగ్గర లేవు.
గతంలో సౌదీలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు దాడి చేయడంతో కొన్ని కీలక రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో హూతీల దాడులను తిప్పికొట్టడం సౌదీకి పెద్ద సవాలుగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహాయం చేస్తానని చెప్పినా.. ఇప్పటివరకు ఆచరణలో పూర్తిస్థాయి రక్షణ దక్కలేదు. ఒకవైపు వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న అద్భుత నగరాలు.. మరోవైపు నిమిషాల్లో వాటిని బూడిద చేసేలా విరుచుకుపడుతున్న డ్రోన్ల దాడులు.. పెట్రోల్ డిపాజిట్లు అయిపోకముందే దేశాన్ని కాపాడుకోవాలని చూస్తున్న యువరాజు సల్మాన్‌కు, ఈ హూతీల దాడులు కోలుకోలేని దెబ్బగా మారాయి.









