
Saima Wazed : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెడ్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో తన పదవికి రాజీనామా చేశారు. WHO దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా ఉన్న ఆమె.. మోసం ఆరోపణలపై విచారణలు జరుగుతున్న సమయంలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
2024 ప్రారంభంలో ఐదేళ్ల కాలానికి WHO ప్రాంతీయ డైరెక్టర్‌గా సైమా వాజెడ్ బాధ్యతలు చేపట్టారు. అయితే గత ఏడాది నుంచి ఆమె జీతం లేని అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉన్నారు. ఆర్థిక మోసం, విద్యార్హతల విషయంలో తప్పుడు సమాచారం, బంగ్లాదేశ్‌లో భూమి కొనుగోలు వంటి అంశాలపై ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
Also Read : సింగపూర్ ప్రధానికి కళ్లు చెదిరే జీతం.. ట్రంప్ కంటే ఏకంగా 7 రెట్లు ఎక్కువ!
సైమా వాజెడ్ తన రాజీనామా లేఖను WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేసస్కు బుధవారం పంపించారు. తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించకుండా తనను అడ్డుకున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖలో WHO నాయకత్వంపై తనకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం పోయింది అని సైమా వాజెడ్ పేర్కొన్నారు. జీతం లేకుండా దాదాపు ఏడాది గడపడంతో తన ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. అందుకే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
2025 జూలైలో సైమా వాజెడ్ను సెలవుపై పంపించారు. అంతకుముందు 2025 మార్చిలో బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ ఆమెపై మోసం, నకిలీ పత్రాలకు సంబంధించిన ఆరోపణలతో కేసులు నమోదు చేసింది. 2026 జూలై 3న ఆమె న్యాయవాదులు WHOకు పంపిన లేఖలో.. చైనాకు చేసిన ప్రయాణానికి సంబంధించిన $901 ఆర్థిక మోసం ఆరోపణ, అలాగే తన విద్యార్హతల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు WHO నుంచి వచ్చాయని పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను సైమా వాజెడ్ ఖండించారు. చైనా ప్రయాణానికి సంబంధించిన $901 విషయం తనకు సంబంధించిన ఉద్దేశపూర్వక మోసం కాదని, సాధారణ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ను చూసే సహాయకుడి నుంచి జరిగిన పరిపాలనా పొరపాటు వల్లే సమస్య వచ్చిందని చెప్పారు. కాగా అక్టోబర్ 12న కొత్త ప్రాంతీయ డైరెక్టర్ పదవికి నామినేషన్లు ప్రకటించే అవకాశం ఉందని, డిసెంబర్లో దరఖాస్తులను పరిశీలించి, జనవరి 24న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
Also Read : మానవ నిర్లక్ష్యంతో ‘విష వ్యర్థాల కుప్ప’గా ఎవరెస్ట్.. ఎంత నష్టమో తెలిస్తే షాక్…









