
Visa Appointments : అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన ఇమిగ్రేషన్ విధానాలతో వలసదారుల్ని భయపెడుతూనే ఉన్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్మెంట్లను సడన్గా నిలిపివేసింది. కొన్ని షెడ్యూల్డ్ ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో శిక్షణకార్యక్రమం మొదలైందని, దానిలో భాగంగానే వీసా అపాయింట్మెంట్ల సర్దుబాటు జరుగుతుందని అమెరికా విదేశాంగశాఖ పేర్కొంది. కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులు, అపాయింట్మెంట్లను తాత్కాలికంగా మాత్రమే రద్దు చేసినట్లు తెలిపింది. విదేశాంగ శాఖ చేపట్టిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం కారణాంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : అమెరికాపై కెనడా తీవ్ర ఆగ్రహం.. భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు
కాగా, ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసే ఉద్ధేశంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. అమెరికా ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను ప్రాథమిక దశలోనే గుర్తించి నిరోధించడానికి కాన్సులర్ అధికారులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీ అధికారులు ప్రతీ వీసా అపాయింట్మెంట్ను మరింత నిశితంగా, ఒకే విధమైన ప్రామాణికతతో పరిశీలించేలా ఈ అంతర్జాతీయ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ శిక్షణా కార్యక్రమం ఉన్నందువల్లే ఇప్పటికే ఖరారైన ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు దరఖాస్తుదారులకు ఈమెయిల్స్ పంపిస్తున్నారు. “గ్లోబల్గా ఉన్న ఎంబసీలలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నాం. అందువల్ల అధికారుల శిక్షణ కోసం వీసా సేవల అపాయింట్మెంట్లలో మార్పులు చేస్తున్నాం” అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపినట్లు రాయిటర్స్ వెల్లడించింది. అయితే, ఈ శిక్షణ ఎంతకాలం సాగుతుంది, రీషెడ్యూల్ చేసిన అపాయింట్మెంట్లు మళ్లీ ఎప్పుడు కేటాయిస్తారనే దానిపై విదేశాంగ శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
Also Read : ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వీసా అపాయింట్మెంట్లు నిలిపివేత









