Shehzad Bhatti : ఒకప్పుడు టిక్‌టాక్‌ స్టార్‌ గా ఒక వెలుగు వెలిగిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షహజాద్‌ భట్టీ ఆ తర్వాత ఐఎస్‌ఐతో జతకట్టి ఉగ్ర కార్యకలపాలకు తెరలేపాడు. అయితే మొదటినుంచి అతని పై అనుమానం ఉన్న భారతీయ భద్రత దళాలు భట్టీపై ఓ కన్నేసి ఉంచాయి. అనుకున్నట్లే అతను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, వ్యాపారవేత్త గా చలామణి అవుతూ గ్యాంగ్‌ స్టర్‌ గా మారాడని, ఐఎస్‌ఐతో చేతులు కలిపి భారత్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు తేలడంతో అతని నెట్‌ వర్క్‌ను భద్రతా దళాలు పూర్తిగా ఛేదించాయి. ఈ క్రమంలో షహజాద్‌ భట్టీ ఉగ్ర కార్యకలపాలు హైదరాబాద్‌ నగరాన్ని సైతం తాకినట్లు తెలియడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ కి సంబంధం ఉన్న పాక్ ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌కు సంబంధాలు ఉన్నాయన్న విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో షహజాద్‌ కు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఉగ్ర ఆరోపణలతో గతంలో అరెస్టైన ఇద్దరు యువకులకు ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఉగ్రకుట్ర కేసులో భాగంగా పోలీసులు ఇటీవల దేశవ్యాప్తంగా 253 మందిని అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

కాగా పోలీసుల అదుపులో ఉన్న 253 మందిలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు తేలింది. వీరిద్దరికీ గాజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జాయిద్ ఖాన్‌తో కీలక సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. జాయిద్ ఖాన్.. ఫిబ్రవరిలో మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్లో పనిచేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో సంబంధం ఏర్పడింది. అనంతరం ఆ ఐఎస్ఐ సానుభూతిపరులతో జాయిద్ ఖాన్ చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలడం కలకలం రేపింది. నగరంలో అరెస్ట్‌ అయిన ఐఏఎస్ సానుభూతిపరులైన హమీద్, రాణా హుస్సేన్‌లతో జాయిద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. వీరి చాటింగ్‌పై నిఘా పెట్టింది. తద్వారా ఈ ఉగ్ర మూలాల్ని ఛేదించింది.

Also Read : కాంగ్రెస్‌ హైకమాండ్ సీరియస్.. సురేఖ, చిన్నారెడ్దికి నోటీసులు.. జక్కిడి సస్పెండ్

షహజాద్ భట్టీకి చెక్‌ పెట్టాం… అమిత్‌ షా

కాగా దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర పన్నిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్, వ్యాపారవేత్తగా చెప్పుకునే .షహజాద్ భట్టీకి భద్రతా బలగాలు చెక్ పెట్టాయని తేల్చి చెప్పారు. అతడి నెట్‌వర్క్‌ను భూస్థాపితం చేశామని ఏకంగా కేంద్రహోం మంత్రి అమిత్‌షా ప్రకటించడం గమనార్హం.

షహజాద్‌ భట్టీ వెనుక అసలు కథ ఏంటంటే?

పాకిస్థాన్‌ లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన షహజాద్ భట్టీ మొదట దోపిడీలతో మొదలు పెట్టి నేర ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు . అంతేకాదు లాహోర్ అండర్‌వరల్డ్ నెట్‌వర్క్‌లో కూడా అతడి పేరు వినిపించింది. అతనిపై తీవ్ర నేరారోపణలు రావడంతో 2013లో పోలీసులు అతడిపై పలు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అతడు పాక్ నుంచి యూఏఈకి పారిపోయాడు. స్క్రాప్‌ సహా పలు వ్యాపారాలు ఉన్నాయని ప్రచారం చేసుకున్నాడు. పాకిస్థాన్‌లో టిక్‌టాక్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత భట్టీ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. మతపరమైన అంశాలు, జాతీయవాదం, ఇతర వివాదాస్పద అంశాలను పోస్టు చేయడంతో.. భారీగా ఫాలోవర్లు పెరిగారు. సోషల్ మీడియాలో షహజాద్ భట్టీ ‘333’ పేరుతో గుర్తింపు పొందాడు. అంతేకాదు భారత్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనకు మంచి స్నేహితుడని చెప్పుకునే భట్టీ 2025లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత బిష్ణోయ్ తో -భట్టీ బంధం చెడింది. పాక్‌కు వ్యతిరేకంగా బిష్ణోయ్ వ్యాఖ్యలు చేయడంతో భట్టీ అతనితో సంబంధాలు తెంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే మొదటి నుంచి భట్టీ కార్యాకలపాలు అనుమానాస్పదంగా ఉండటంతో భారత దర్యాప్తు బృందాలు అతనిపై ఒక కన్నేసి ఉంచాయి. ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్‌ చక్రవర్తితోపాటు పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లపై భట్టీ బెదిరింపులకు పాల్పడినట్లు ఆర్మీ గుర్తించింది. అంతేకాక పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లను భయభ్రాంతులకు గురి చేసినట్లు వెలుగు చూసింది. అందులో భాగంగా 2024, మార్చిలో పంజాబ్‌లోని జలంధర్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్ రోజర్ సంధు నివాసం వద్ద గ్రనేడ్ దాడి చేయించాడు. ఈ గ్రనేడ్ దాడికి భట్టీనే కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా అతడికి పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్‌ (ISI)తో సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. నిరుద్యోగ యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించేలా చేయడంతో పాటు భారత్‌లో తన ప్రభావాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ, పంజాబ్ ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాల్లో అతడిపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. భారత సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు కలిగిస్తున్నాడన్న ఆరోపణల రావడంతో ఆతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ కూడా కేసులు నమోదు చేసింది.

Also Read : రాజీనామా చేసి మళ్లీ గెలవండి చూద్దాం…సీఎం రేవంత్‌ రెడ్డికి కొండా సుస్మిత సంచలన సవాల్

ఇక గత నెలలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆపరేషన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా గ్యాంగ్‌స్టర్‌ షహజాద్‌ భట్టీ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 112 మందిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరిద్వారా భారత్‌లో పలు బాంబు దాడులు, హత్యల వెనుక భట్టీ నెట్‌వర్క్‌ హస్తం ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు.. ఆ గ్రూప్‌నకు చెందిన 200 మందికిపైగా సభ్యుల్ని అరెస్టు దేశ వ్యాప్తంగా అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. అందులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఉండటం మరింత కలవరపరిచే విషయమనే చెప్పాలి. ప్రస్తుతం వారి నెట్‌ వర్క్ ను పూర్తిగా తుడిచిపెట్టినపప్పటికీ మూలాలు ఇంకా ఎక్కడ ఉన్నాయన్నది తేలాల్సి ఉంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.