
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా గెలిస్తే.. చమురు ధరలు భారీగా తగ్గుతాయని చెప్పారు. చివరికి పెట్రోల్ ధర గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే తక్కువకు కూడా రావచ్చని తెలిపారు. తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. యుద్ధం ముగిసి అమెరికా విజయం సాధించిన తర్వాత ముందుగా పెట్రోల్ ధర గ్యాలన్‌కు 3 డాలర్లకు తగ్గుతుందని, ఆ తర్వాత 2 డాలర్ల కంటే కూడా తక్కువకు పడిపోతుందని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోకుండా అమెరికా అడ్డుకుంటుందని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధం ఉండదని అన్నారు.
Also Read : భారత్‌కు బ్రిటన్ గుడ్‌న్యూస్.. కార్బన్ పన్నుపై ఊరట!
మరోవైపు ఇరాన్ కూడా అమెరికాకు గట్టి హెచ్చరిక చేసింది. తమ చమురు, గ్యాస్ కేంద్రాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్ హెచ్చరించారు. ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలు చాలా పెద్ద ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిపై దాడులు చేస్తే అమెరికా చమురు, గ్యాస్ సంస్థలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. తమ ఆస్తులపై దాడి చేస్తే.. మీ ఆస్తులపైనా దాడి జరుగుతుందని ఘలీబాఫ్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో అమెరికా వార్ సెక్రటరీ పీట్ హెగ్‌సెత్ కూడా ఇరాన్‌ను హెచ్చరించారు. అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేస్తే.. ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్లను ధ్వంసం చేస్తామని అన్నారు. ఇరాన్ వద్ద తమ చమురు నౌకలను కాపాడుకునేంత బలమైన నౌకాదళం, వైమానిక దళం లేవని చెప్పారు. అమెరికా విమానాలు, నౌకలు, జలాంతర్గాములతో ఇరాన్ చమురు నౌకలపై దాడులు చేయగలమని హెచ్చరించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ నౌకలు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు డబ్బులు అందించే అక్రమ నెట్‌వర్క్‌లో భాగమని అమెరికా ఆరోపించింది.
సెంట్రల్ కమాండ్ అధికారి బ్రాడ్ కూపర్ కూడా గట్టి హెచ్చరిక చేశారు. మా రెండు నౌకలపై దాడి చేస్తే.. మీ మూడు నౌకలను ధ్వంసం చేసి మరింత నష్టం కలిగిస్తాం అని అన్నారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఒకవైపు యుద్ధంలో గెలిస్తే చమురు, పెట్రోల్ ధరలు తగ్గుతాయని ట్రంప్ చెబుతుండగా.. మరోవైపు తమ చమురు, గ్యాస్ కేంద్రాలపై దాడులు చేస్తే అమెరికాకు గట్టి సమాధానం ఇస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.
Also Read : హిందూ గ్రూప్ విజిట్.. ఈఫిల్ టవర్ మూసివేత!









