
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బొమ్మతో రూపొందించిన కొత్త $1 కాయిన్‌కు భారీ డిమాండ్ వచ్చింది. కలెక్టర్లు ఈ కాయిన్‌ను కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపడంతో అమెరికా మింట్ వెబ్సైట్లో ఉన్న స్టాక్ విడుదలైన కొన్ని గంటల్లోనే దాదాపుగా ఖాళీ అయిపోయింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన $1 కాయిన్ ను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అమెరికా మింట్ ఆన్లైన్లో విక్రయానికి పెట్టింది. కాయిన్ అమ్మకాలు మొదలైన వెంటనే వెబ్‌సైట్‌కు భారీగా సందర్శకులు వచ్చారు. దీంతో చాలామందిని వర్చువల్ వెయిటింగ్ రూమ్‌లో ఉంచగా, కొందరు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది.
25 కాయిన్ల రోల్ ధర 61 డాలర్లు. 100 కాయిన్ల బ్యాగ్ ధర 154.50 డాలర్లు. అయితే బుధవారం మధ్యాహ్నానికే ఈ రెండు రకాల కాయిన్లు కూడా అందుబాటులో లేవని అమెరికా మింట్ వెబ్సైట్లో చూపించింది. ఈ కాయిన్‌ను రాగి, జింక్, మాంగనీస్, నికెల్ కలిపిన ప్రత్యేక లోహంతో తయారు చేశారు. చూడటానికి బంగారు రంగులో ఉన్నప్పటికీ ఇందులో అసలు బంగారం ఉండదు.
Also Read : దక్షిణాఫ్రికా మొత్తాన్ని ఫొటో తీసే కెపాసిటీ.. శత్రువుల దాడులను పసిగట్టే శక్తి.. GSLV-F17 ప్రత్యేకతలివే!
కాయిన్ ముందు భాగంలో ట్రంప్ చిత్రాన్ని ఉంచారు. దాని పక్కన LIBERTY, IN GOD WE TRUST అనే పదాలతో పాటు ‘1776 ~ 2026’ తేదీలను ముద్రించారు. వెనుక భాగంలో అమెరికా అధ్యక్షుడి అధికారిక ముద్రను ఉంచారు. అందులో ఆలివ్ కొమ్మ, బాణాలు పట్టుకున్న గద్ద కనిపిస్తుంది. దానిపై E PLURIBUS UNUM అనే పదాలు ఉన్నాయి. గద్ద ఛాతిపై ఉన్న షీల్డ్‌లో 250 అనే సంఖ్యను ముద్రించారు. ఇది అమెరికా 250వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. వెనుక భాగంలో UNITED STATES OF AMERICA, ONE DOLLAR అనే పదాలు కూడా ఉన్నాయి.
ఈ కాయిన్ విడుదలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అమెరికా కరెన్సీపై జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలను పెట్టడం చాలా అరుదు. రికార్డుల ప్రకారం, గతంలో జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రం అమెరికా కాయిన్‌పై కనిపించిన మరో సందర్భం 1926లో జరిగింది. అప్పట్లో అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చిత్రంతో ఒక ప్రత్యేక హాఫ్ డాలర్ కాయిన్‌ను విడుదల చేశారు. అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ కాయిన్‌ను తీసుకొచ్చారు. భారీ డిమాండ్ రావడంతో అమెరికా మింట్ మొదట ఒక్క కుటుంబానికి రెండు కాయిన్లు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. అయితే ఈ $1 కాయిన్లను అమెరికా 250వ వార్షికోత్సవ సంవత్సరం మొత్తం దేశవ్యాప్తంగా దశలవారీగా చలామణిలోకి తీసుకురానుంది.
Also Read : ఇరాన్-భారత్ డీల్.. అమెరికా సంచలన వార్నింగ్.. ఎందుకో తెలుసా?









