BIG BREAKING :  పెరూ దేశంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యునెస్కో గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాజ్కా లైన్స్ ప్రాంతంపై పర్యాటకులతో వెళ్తున్న ఒక చిన్న విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నాజ్కా ప్రావిన్స్ అధికారులు తెలిపారు.

పెరూ స్టేట్ బ్రాడ్‌కాస్టర్టీవీ పెరూ అందించిన సమాచారం ప్రకారం, ఈ విమానంలో 11 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. నాజ్కా నగరానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో, నాజ్కా లైన్స్‌కు దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యూబ్లో వీజో ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలింది.

ఈ విమానం పెరూవియన్ ఎయిర్‌లైన్స్ అయిన ఏరోడియానా సంస్థకు చెందినదని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై ఎయిర్‌లైన్స్ నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

నాజ్కా లైన్స్‌ను విహారయాత్రలో భాగంగా వీక్షించేందుకు పిస్కో విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది.

ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఎండిన మైదానంలో పొగలు కక్కుతున్న విమాన శకలాలు పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోల ప్రామాణికతను పూర్తిగా నిర్ధారించలేమన్నారు.

పెరూలోని నాజ్కా లైన్స్ అనేది యునెస్కో జాబితాలో ఉన్న చారిత్రక ప్రదేశం. ఇక్కడ ఎడారిలో భారీ ప్రాచీన గ్లిఫ్స్ చెక్కబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇక్కడకు సుమారు 1,00,000 మంది సందర్శకులు వస్తుంటారు. ఎక్కువ మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చిన్న విమానాల ద్వారానే పైనుండి వీక్షిస్తుంటారు.

కాగా, ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు బలమైన ఈదురు గాలుల (గంటకు 40 కి.మీ. వేగం) కారణంగా సమీపంలోని మరియా రీచే విమానాశ్రయం నుంచి సాగే విమాన సర్వీసులను నిలిపివేశారు. దుమ్ము రేగడం వల్ల దృశ్యమానత తగ్గిపోవడంతో పర్యాటకులతో వెళ్తున్న రెండు విమానాలను మార్కోనా విమానాశ్రయానికి దారి మళ్లించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.