Ukraine vs Iran
Ukraine vs Iran

యుద్ధం రూటు మార్చుకుందా.. ఇరాన్‌ యాంగిల్‌ మార్చిందా.. అమెరికాను పక్కనపెట్టి ఉక్రెయిన్‌పై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైందా..ఉన్నట్లుంది ఉక్రెయిన్‌పై ఎందుకు ఇరాన్‌ ఉడికిపోతోంది. తగిన మూల్యం చెల్లించాల్సిందేనని మిస్సైల్స్‌తో ఎందుకు దూకుతోంది.. మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా..

కాస్పియన్ సముద్రంలో తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేసి ఒక నావికుడిని పొట్టనబెట్టుకుందని, మరో నావికుడు తీవ్రంగా గాయపడ్డాడని ఇరాన్ ఆరోపించింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టెహ్రాన్.. తమ దేశ ప్రయోజనాలు, ఆస్తులను కాపాడేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ దాడికి కారణమైన ఉక్రెయిన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది.

యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలంటే ఉక్రెయిన్‌ను అదుపులో పెట్టాలని ఐరోపా దేశాలకు ఇరాన్ డిమాండ్ చేసింది. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read : 24 గంటల నాన్ స్టాప్ జర్నీ.. చరిత్ర సృష్టించిన క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్

అయితే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం రష్యా నుంచి ఇరాన్‌కు ఉపగ్రహ సమాచారం అందుతోందని ఆరోపించారు. గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలకు సంబంధించిన రష్యా సేకరిస్తున్న ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ తన దాడుల్లో వినియోగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా ఆంక్షల నేపథ్యంలో కాస్పియన్ సముద్ర మార్గం ప్రస్తుతం ఇరాన్‌కు అత్యంత కీలకమైన వాణిజ్య మార్గంగా మారింది. ఉత్తర దిశలోని ఈ మార్గం ద్వారానే చైనా సహా పలు దేశాల నుంచి సరుకులు ఇరాన్‌కు చేరుతున్నాయి. అలాంటి కీలక మార్గంలో ఇరాన్ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేయడం పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేసింది.

మరోవైపు రష్యా కూడా తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఆదివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడికి దిగింది. మొత్తం ఏడు బాలిస్టిక్ క్షిపణులు, 136 డ్రోన్లతో దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. కీవ్‌తో పాటు చెర్నిహివ్, ఖార్కివ్ తదితర నగరాలపై కూడా దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఒకవైపు ఇరాన్–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండగా.. మరోవైపు రష్యా క్షిపణి దాడులు కొనసాగుతుండటంతో యుద్ధం మరింత ప్రమాదకర దశలోకి వెళ్తుందా అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఏ వైపు చూసినా మూడో ప్రపంచ యుద్ధం పరిస్థితులే కనిపిస్తున్నాయని అంతర్జాతీయ అనలిస్టులు చెబుతున్నారు.

Also Read : మూడేళ్ల వరకు హెచ్‌-1బీ వీసాలు బంద్.. ఆయిల్ పై 100% ట్యాక్స్.. భారత్ కు ట్రంప్ బిగ్ షాక్?