
Donald Trump : అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మళ్లీ తీవ్రం కానుందా? నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు చేసే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు అమెరికా అధికారులు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
అయితే ఈ వార్తపై ఇరాన్ నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు. ఇరాన్ మాత్రం అమెరికా అధికారిక సమాధానం కోసం ఎదురుచూస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం న్యూయార్క్‌లో మాట్లాడుతూ.. అమెరికా కొన్ని షరతులను అంగీకరిస్తే ఏడు రోజుల్లో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, సాధారణ నౌకల రాకపోకలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను తొలగించాలని, లెబనాన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కాల్పుల విరమణ పాటించాలని ఇరాన్ కోరింది. ఈ షరతులు అంగీకరిస్తే హోర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తెరిచి, అణు కార్యక్రమంపై అమెరికాతో మళ్లీ చర్చలు ప్రారంభిస్తామని ఇరాన్ తెలిపింది. ప్రపంచంలో చమురు, గ్యాస్ రవాణాకు హోర్ముజ్ జలసంధి చాలా కీలకమైన మార్గం. ఈ మార్గంలో రాకపోకలు ఆగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, ఇంధన సరఫరాపై ప్రభావం పడుతోంది. అందుకే ఇరాన్ ప్రతిపాదనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
Also Read : పాక్ ప్రధానికి కౌంటర్ ఇచ్చిన పేటల్ గహ్లోత్ ఎవరు?
అయితే ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇరాన్ తన డిమాండ్లను పూర్తిగా అంగీకరిస్తుందా అన్నదానిపై ట్రంప్‌కు నమ్మకం లేదని అమెరికా అధికారులు తెలిపినట్లు ఆ కథనం వెల్లడించింది. నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు చేసే అవకాశం ఉందని ట్రంప్ తన సన్నిహితులతో చెప్పినట్లు కూడా నివేదిక పేర్కొంది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో కలిసి జూన్ 17న ట్రంప్ 14 అంశాలతో కూడిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇందులో వెంటనే సైనిక చర్యలు ఆపడం, లెబనాన్‌లోనూ పోరాటాన్ని నిలిపివేయడం, 60 రోజుల్లో తుది ఒప్పందం కోసం చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయి. అయితే జూలై 8న ట్రంప్ ఆ ఒప్పందం ఇక లేదని ప్రకటించారు. వారం రోజుల తర్వాత ఇరాన్ కూడా ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. అమెరికా తన హామీలను ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది.
ఆ తర్వాత నుంచి ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడానికి తొందరపడటం లేదని ట్రంప్ పలుమార్లు చెప్పారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా నవంబర్ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ మాట్లాడారు. అయితే ఇరాన్ మాత్రం ఎన్నికలకు ముందే ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు అమెరికా వైట్‌హౌస్ మాత్రం మధ్యవర్తులతో అమెరికా అధికారులు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుతున్నారని శుక్రవారం తెలిపింది. దీంతో ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : ఇటలీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బుర్ఖా, నిఖాబ్‌పై బ్యాన్!









