Donald Trump : అమెరికాలో H-1B వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములకు మరో షాక్ తగలనుంది. H-1B వీసా ఉన్న వారి భార్యలు, భర్తలకు ప్రస్తుతం ఉన్న పని చేసే హక్కును తొలగించే దిశగా అమెరికా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, వేలాది మంది H-4 వీసా హోల్డర్లు అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

H-1B వీసా ఉన్న ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కొన్ని నిబంధనల ప్రకారం పని చేసుకునే అవకాశం కల్పించే H-4 EAD విధానం పదేళ్లకు పైగా అమల్లో ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ముఖ్యంగా భారతీయ కుటుంబాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే H-4 వర్క్ పర్మిట్లు పొందుతున్న వారిలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

Also Read : కెనడాలో చదవాలనుకునే విద్యార్థులకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి రూల్స్ ఛేంజ్!

2014 నుంచి 2017 మధ్య H-4 దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే, ఆమోదం పొందిన వాటిలో దాదాపు 93 శాతం భారతీయులకు చెందినవే. వీరిలో 94 శాతం మంది మహిళలే. అందువల్ల H-4 EAD విధానాన్ని రద్దు చేస్తే భారతీయ మహిళలపై, ముఖ్యంగా H-1B ఉద్యోగుల కుటుంబాలపై ప్రభావం గణనీయంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనను ఎప్పుడు అధికారికంగా విడుదల చేస్తారనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి తేదీని ప్రకటించలేదు.

DHS ప్రతిపాదన ప్రకారం, H-1B వీసా ఉద్యోగులపై ఆధారపడి H-4 వీసాతో అమెరికాలో ఉంటున్న కొన్ని జీవిత భాగస్వాములకు ఉద్యోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే అర్హతను తొలగించాలని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం H-4 వీసా ఉన్న కొందరు జీవిత భాగస్వాములకు EAD కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు.

H-4 EAD విధానాన్ని రద్దు చేయాలనే ప్రయత్నం అమెరికాలో ఇదే మొదటిసారి కాదు. ట్రంప్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలో ఉన్న సమయంలో, 2017లో కూడా కొన్ని H-4 జీవిత భాగస్వాములకు ఉద్యోగ అనుమతిని తొలగించే ప్రతిపాదన చేసింది. అయితే ఆ ప్రతిపాదన చివరకు అమల్లోకి రాలేదు. 2021లో దానిని ఉపసంహరించుకున్నారు.

Also Read : లక్షల్లో జీతం, H-1B వీసా ఉన్నా అమెరికాను వదిలేసింది.. ఎందుకంటే?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.