US Israel Arms Deal : ఇరాన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మరో భారీ ఆయుధ ప్యాకేజీని అందించడానికి సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా వెలువరించిన కథనాలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 2.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.26 వేల కోట్లు) విలువైన ఈ ఆయుధ ఒప్పందంలో 40,000 భారీ బాంబులు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ ఆయుధ విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : ఛీ ఛీ.. పరువు తీసుకున్న పాక్.. ఫెయిర్‌నెస్‌ క్రీములలో కూడానా… భారత్ అలెర్ట్!

కాగా అమెరికా ప్రతిపాదిత ప్యాకేజీలో ఒక్కోటి టన్ను బరువుండే 20,000 ఎంకే-84 బాంబులు, 20,000 బీఎల్‌యూ-117 బాంబులు, 20,000 ఐ-2000 పెనిట్రేటర్ వార్‌హెడ్లు ఉన్నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొంది. ఎంకే-84 వంటి అత్యంత శక్తివంతమైన బాంబులు భూగర్భ లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడతాయని తెలుస్తోంది. మిగిలినవి భూమి ఉపరితలంపై అత్యధిక విస్తీర్ణంలో పేలుడు ప్రభావాన్ని కలిగించేందుకు ఉపయోగపడతాయి.

ఈ ఒప్పందంలో ఎక్కువ భాగం ఫారిన్ మిలిటరీ ఫైనాన్సింగ్ విధానం ద్వారా నిధులు సమీకరిస్తున్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. అంటే అమెరికా ప్రభుత్వం అందించే నిధులతోనే అమెరికా నుంచి ఇజ్రాయెల్ ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. అంటే అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులతోనే ఈ కొనుగోలు జరుగుతోందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం గురించి అమెరికా కాంగ్రెస్‌లోని సంబంధిత కమిటీలకు అనధికారికంగా సమాచారం అందినట్లు ‘రాయిటర్స్’ తన కథనం లో తెలిపింది

గతంలో గాజాలో పౌరుల ప్రాణనష్టంపై ఆందోళనల నేపథ్యంలో 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం భారీ బాంబుల రవాణాను నిలిపివేసింది . అయితే ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆంక్షలను తొలగించడం గమనార్హం. కాగా, తాజా ఒప్పందం తుది ఆమోదం, ఆయుధాల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Also Read : పాక్ లో దురంధర్ తరహా హత్యలు? ఉగ్రవాదులే టార్గెట్ గా అదృశ్యశక్తుల ఫైరింగ్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.