
Pickaxe Mountain : అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఇరాన్‌పై ప్రళయ ముప్పు పొంచి ఉంది. అమెరికా ఇప్పటివరకు ఇరాన్‌పై జరిపిన అతిపెద్ద దాడికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌లోని ‘పికాక్స్ పర్వతం’పై దాడి చేస్తామని హెచ్చరించారు. దీంతో అసలు ఈ పర్వతం ఏంటి? అక్కడ ఏం ఉంది? అనే చర్చ మొదలైంది. పికాక్స్ మౌంటెన్ అనేది ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రానికి దగ్గరగా ఉన్న కొండ ప్రాంతం. ఇది ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. నతాంజ్ అణు కేంద్రం నుంచి ఇది కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇందులోని కోలాంగ్ అనే పదానికి పికాక్స్ అంటే కొండలు, రాళ్లు పగలగొట్టే పనిముట్టు అనే అర్థం. అందుకే దీనిని పికాక్స్ మౌంటెన్ అని పిలుస్తున్నారు.
ఇది మామూలు కొండ కాదని నిపుణులు చెబుతున్నారు. కొండ లోపల చాలా లోతులో పెద్ద పెద్ద సొరంగాలు, భూగర్భ గదులు నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ నిర్మాణాలు భూమికి కనీసం 100 మీటర్ల లోతులో ఉన్నట్లు అంచనా. కొండకు నాలుగు సొరంగాల ప్రవేశ మార్గాలు ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ ప్రాంతంపై అమెరికా చాలా కాలంగా నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. పికాక్స్ మౌంటెన్‌కు ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉందనే అనుమానాలు ఉన్నాయి. 2020లో ఇక్కడ నిర్మాణ పనులు మొదలయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ గతంలో కొండ లోపల నిర్మిస్తున్న హాళ్లను అధునాతన సెంట్రిఫ్యూజ్‌లు తయారు చేసేందుకు ఉపయోగిస్తామని చెప్పింది. యురేనియంను శుద్ధి చేసే ప్రక్రియలో సెంట్రిఫ్యూజ్‌లు ఉపయోగిస్తారు. అయితే ఈ కేంద్రం ప్రస్తుతం పూర్తిగా పనిచేస్తుందా లేదా అనేది స్పష్టంగా లేదు. ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన నిపుణులు నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఇరాన్ మాత్రం ఇక్కడ ఎలాంటి అణు కార్యకలాపాలు జరగడం లేదని చెబుతోంది.
Also Read : లీక్ దొంగలెవరు ..? మిలిటరీ అధికారులకు ట్రంప్ లైడిటెక్టర్ పరీక్షలు!
పికాక్స్ మౌంటెన్ నతాంజ్ అణు కేంద్రానికి చాలా దగ్గరగా ఉండటం ప్రధాన కారణం. నతాంజ్ ఇరాన్‌లోని ముఖ్యమైన యురేనియం శుద్ధి కేంద్రాల్లో ఒకటి. ఇటీవల ఇరాన్‌పై జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో నతాంజ్‌కు నష్టం జరిగినట్లు సమాచారం. కానీ పికాక్స్ మౌంటెన్ మాత్రం ఆ దాడుల నుంచి బయటపడింది. దీనికి ప్రధాన కారణం.. అది కొండ లోపల చాలా లోతులో ఉండటమే అని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా బాంబులు అక్కడి వరకు వెళ్తాయా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. భూమి లోపల ఉన్న బలమైన సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా దగ్గర బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయి. వీటిలో GBU-57 చాలా శక్తివంతమైన బాంబుగా చెబుతారు. అయితే పికాక్స్ మౌంటెన్‌లోని నిర్మాణాలు చాలా లోతులో ఉండటంతో వాటిని పూర్తిగా ధ్వంసం చేయడం అంత సులభం కాదని నిపుణుల అంచనా. అక్కడ కొన్ని బలహీనమైన ప్రాంతాలను మాత్రం వైమానిక దాడులతో టార్గెట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే ఒక్క బాంబుతో కొండ కింద ఉన్న మొత్తం ప్రాంతాన్ని నాశనం చేయడం సాధ్యమేనని చెప్పలేం.
పికాక్స్ మౌంటెన్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం. సొరంగాల ప్రవేశ మార్గాలను కూడా బలంగా తయారు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సొరంగాలపై కాంక్రీట్, మట్టి పొరలు వేసినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. తూర్పు వైపు ఉన్న రెండు సొరంగాల దగ్గర మట్టిని కూడా పోసినట్లు తెలుస్తోంది. వాహనాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు.
నతాంజ్ అణు కేంద్రం ఇప్పటికే దాడులతో దెబ్బతిన్నట్లు సమాచారం. కానీ దానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పికాక్స్ మౌంటెన్ మాత్రం ఇప్పటివరకు పెద్దగా దెబ్బతినలేదు. కొండ లోపల 100 మీటర్లకు పైగా లోతులో నిర్మాణాలు.. చుట్టూ భారీ భద్రత.. అణు కార్యక్రమంతో సంబంధం ఉందన్న అనుమానాలు.. ఇవన్నీ కలిసి పికాక్స్ మౌంటెన్‌ను ఇరాన్‌లో అత్యంత కీలకమైన, రహస్యమైన ప్రాంతాల్లో ఒకటిగా మార్చాయి. అందుకే ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పికాక్స్ మౌంటెన్‌పై అమెరికా దాడి చేస్తుందా? అక్కడి భూగర్భ స్థావరాలను ధ్వంసం చేయగలదా? అనే ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.
Also Read : టిక్‌టాక్ ఫాలోవర్ల కోసం చెల్లితో గొడవ.. 15 ఏళ్ల చెల్లిని కత్తితో చంపిన అక్క!









