NEET-UG :  నీట్‌యూజీ ప్రశ్నపత్రం లీక్‌…సీబీఐ ఎంట్రీతో కదులుతున్న డొంక

NEET-UG : నీట్‌-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI) కి అప్పగించడంతో విచారణ ముమ్మరమైంది. దర్యాప్తు సంస్థల తనిఖీల్లో లీకేజీకి సంబంధించిన ఒక్కొక్క లింకు బయటకు వస్తోంది.  
 
నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీక్‌ కేసు దర్యాప్తును చేతుల్లోకి తీసుకున్న సీబీఐ, దేశవ్యాప్తంగా పలుచోట్ల ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఐదుగురిని అధికారికంగా అరెస్టు చేయగా, మరో రెండు డజన్ల మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అరెస్టయిన వారిలో రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్‌ బివాల్, వికాస్‌ బివాల్, దినేశ్‌ బివాల్‌తో పాటు హరియాణాకు చెందిన యశ్‌ యాదవ్, మహారాష్ట్రకు చెందిన శుభం ఖైర్నార్‌ ఉన్నారు. నిందితులకు చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి డిజిటల్ పరికరాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. కాగా, కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఓ నిందితుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో అసలైన పెద్ద తలకాయలను రక్షిస్తూ, తనలాంటి సామాన్యులను వేధిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశాడు.

రాజస్థాన్‌లో నీట్‌ ప్రశ్నపత్రం లీకైనట్లు గట్టి ఆధారాలు లభించడంతో, జాతీయ పరీక్షల సంస్థ (NTA) మొత్తం పరీక్షను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 23 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ.. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన రాజస్థాన్‌ ప్రత్యేక ఆపరేషన్స్‌ గ్రూప్‌ (SOG)తో కలిసి విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే దిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సీబీఐ బృందం సందర్శించి, నీట్‌ పరీక్షకు సంబంధించిన కీలక పత్రాలను, రికార్డులను స్వాధీనం చేసుకుంది.

ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి సికార్, ఝుంఝునూ, అలవర్, జైపుర్‌ నగర, గ్రామీణ సంయుక్త పోలీసుల బృందాలు రంగంలోకి దిగి దాదాపు 150 మందికి పైగా విద్యార్థులను విచారించాయి. అయితే, ఈ లీక్‌ వ్యవహారంలో కోచింగ్‌ సెంటర్ల పాత్ర నేరుగా ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఒక కన్సల్టెంట్, కొందరు విద్యార్థుల ద్వారా అనేక సోషల్ మీడియా ఛానళ్లలో ‘గెస్‌ పేపర్‌’ పేరుతో పీడీఎఫ్‌ రూపంలో ఇది సర్కులేట్‌ అయింది. ఆ గెస్‌ పేపర్‌ను ప్రింట్‌ తీసి విద్యార్థులకు అందించిన ఒక జిరాక్స్ దుకాణ యజమానిని కూడా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రశ్నపత్రం ‘ప్రైవేటు మాఫియా’ పేరుతో ఏర్పాటు చేసిన ఒక సోషల్ మీడియా గ్రూప్ ద్వారా, పాస్‌వర్డ్‌తో కూడిన పీడీఎఫ్ (PDF) రూపంలో రాజస్థాన్‌లో చాలా మందికి చేరింది. కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న రాజస్థాన్‌ (సికార్‌) కు చెందిన ఒక విద్యార్థికి గురుగ్రామ్ వ్యక్తి ద్వారా ఈ ‘గెస్ పేపర్’ అందింది. ఆ విద్యార్థి దానిని రాజస్థాన్‌లోని ఒక హాస్టల్ ఓనర్‌కు, తన స్నేహితులకు షేర్ చేయగా.. అక్కడి నుంచి కోచింగ్ తీసుకుంటున్న ఇతర విద్యార్థుల ఫోన్లలోకి చేరింది. అయితే, విద్యార్థుల మధ్య క్వశ్చన్ బ్యాంక్ పేరుతో ఇది సర్కులేట్‌ అవుతోందని గుర్తించిన సికార్‌ హాస్టల్ ఓనరే దీనిపై స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం అందించినట్లు ఎస్‌వోజీ ఐజీ అజయ్‌ పాల్‌ లాంబా వెల్లడించారు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రశ్నపత్రం ప్రింట్ అయిందని, అక్కడి నుంచే ఇది లీకైనట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పుణెలో ఒక మహిళను అదుపులోకి తీసుకుని సీబీఐకి అప్పగించారు. మరోవైపు, ఈ కేసు ఇప్పుడు రాజస్థాన్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. అరెస్టయిన నిందితుల్లో ఒకరైన దినేశ్ బివాల్.. బీజేపీ యువమోర్చా జైపుర్ గ్రామీణ కార్యదర్శి అని, అతనికి అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నేత ముఖేష్ దధీచ్ ఖండించగా, దినేశ్ తల్లి మాత్రం తన కుమారుడు స్థానిక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడని పేర్కొనడం గమనార్హం.

నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని కోరుతూ ‘ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్’ (FAIMA) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు, 23 లక్షల మంది విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని ఆయన నివాసం ముందర ఎన్‌ఎస్‌యూఐ (NSUI) కార్యకర్తలు తీవ్ర ఆందోళన నిర్వహించారు. అలాగే ఎన్‌టీఏ కార్యాలయం ఎదుట ఏబీవీపీ (ABVP) శ్రేణులు కూడా నిరసనలు చేపట్టడంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహం వెల్లువెత్తుతోంది.