Tamilnadu: విజయ్‌ సినిమా చూసి ఆదర్శంగా నిలిచిన యువకుడు.. రాష్ట్ర అప్పు తీర్చేందుకు ఆర్థిక సాయం

ప్రముఖ హీరో విజయ్ తన కెరీర్ ప్రారంభంలో నటించిన ‘తమిళన్’ (2002) సినిమా స్పూర్తితో ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆ సినిమాలో హీరో విజయ్‌ దేశంలోని అప్పును తీర్చేందుకు ప్రధానికి రూ.4000 చెక్కును పంపుతాడు. 25 ఏళ్ల తర్వాత.. విజయ్ తమిళనాడు(tamilnadu) సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. చెన్నైకి చెందిన అరుణ్ లోకనాథన్ అనే వ్యక్తి కూడా ఇలాంటి తరహాలోనే స్పందించారు. రాష్ట్ర అప్పులో తన వంతు వాటాగా రూ. 22,674లను సీఎం సహాయ నిధికి జమ చేశారు.

అరుణ్ లోకనాథన్ (43) మెంటలిస్ట్, హిప్నాటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు బడ్జెట్ గణాంకాలు విడుదలైన సంగతి తెలిసిందే. వీటి ఆధారంగా ఈ మొత్తాన్ని అరుణ్ లెక్కించారు. రాష్ట్ర అప్పు ఒక్కో వ్యక్తిపై లక్ష రూపాయలకు పైగా ఉన్నట్లు గుర్తించారు. అయితే విజయ్ పుట్టినరోజైన జూన్ 22, 1974ను గుర్తుచేస్తుకుంటూ రూ. 22,674లు సీఎం సహాయ నిధికి అందించారు. “మనం కోరుకునే మార్పు మన నుంచే మొదలవ్వాలి” అనే ఆలోచనతో విల్లివాక్కం పోస్టాఫీసు ద్వారా ఈ నిధులను పంపించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also read: ఢిల్లీలో వర్క్‌ ఫ్రం హెం.. సీఎం రేఖా గుప్తా 10 కీలక ప్రకటనలు

Chennai Man Donates RS 22,674 To CM Relief Fund

రాష్ట్ర అప్పు తీర్చడం కోసం తన వంతు సాయం మాత్రమే కాకుండా.. సీఎం విజయ్‌(cm vijay) కు ఓ లేఖ రాశారు. తాను చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డట్లు అరుణ్ తెలిపారు. వికలాంగులకు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు, సులభతర ప్రవేశ మార్గాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తాను పంపిన నిధులు అప్పు తీర్చడానికి కాకున్నా.. కనీసం వికలాంగుల సంక్షేమం కోసమైనా ఉపయోగపడితే తాను చేసిన ప్రయత్నం సఫలమైనట్లేనని రాసుకొచ్చారు. 

ఇదిలాఉండగా అరుణ్ గతంలో అంబేద్కర్ లా కాలేజీలో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ‘తమిళన్’ సినిమా చూశారు. ఈ చిత్రంలోని హీరో ఆశయాలకు ప్రభావితమయ్యారు. ఆ సినిమాలో విజయ్ లాయర్‌గా నటించారు. సామాన్యులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ.. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు.  25 ఏళ్ల క్రితం వెండితెరపై చూసిన ఆ దృశ్యాలను.. ఇప్పుడు తన అభిమాన నటుడు నిజ జీవితంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అరుణ్ ఇలా ఆచరణలో పెట్టడం విశేషం. అరుణ్ చేసిన ఈ మంచిపనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: హర్మూజ్ జలసంధిని దాటిన రెండు భారతీయ LPG నౌకలు