US Iran War : అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం కేవలం వాణిజ్య పరంగానే కాకుండా వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా ఇరాన్‌తో సాగిస్తున్న యుద్ధం ఫలితంగా డీజిల్, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అమెరికా రైతులు గత నాలుగు దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఒక కథనంలో నివేదించింది. ఇప్పటికే కొన్నేళ్లుగా పంటల ధరలు తగ్గడం, ఆదాయాలు పడిపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ తాజా ధరల షాక్ మరింత భారంగా మారిందని కథనం వెల్లడించింది.

యుద్ధం ప్రారంభమైన తర్వాత గత ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ జరిపిన దాడిని నిరసిస్తూ, ప్రపంచ ఇంధన సరఫరాలో ఐదవ వంతు వాటా కలిగిన కీలక జలమార్గం అయిన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ గుండా వ్యాపార నౌకల రాకపోకలను టెహ్రాన్ (ఇరాన్) తీవ్రంగా అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల పెరిగిన ఇంధన ధరలు నవంబర్‌లో జరగనున్న మిడ్‌టర్మ్ (మధ్యంతర) ఎన్నికల ముందు అమెరికా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ఎన్నికలే అమెరికా కాంగ్రెస్ నియంత్రణను తేల్చనుండటం గమనార్హం.

ఇరాన్‌ పై సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుండి డీజిల్, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ‘కార్న్ బెల్ట్’ (మొక్కజొన్న పండించే ప్రాంతాలు) వ్యాప్తంగా ఉన్న రైతుల మీద తీవ్ర ప్రభావం పడిందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ఈ ఆర్థిక మాంద్యం 1980ల తర్వాత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన సంక్షోభమని నెబ్రాస్కా ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు జాన్ హాన్సెన్ అభివర్ణించారు.”దిగుబడి ఖర్చులు (ఇన్‌పుట్స్) పూర్తిగా అదుపు తప్పాయి” అని నెబ్రాస్కాకు చెందిన మొక్కజొన్న, సోయాబీన్ రైతు మాట్ బైలీ పత్రికతో పేర్కొన్నారు. దశాబ్దం క్రితం టన్నుకు దాదాపు $470 ఉన్న ఫాస్పరస్ ఎరువుల ధర ఇప్పుడు $900 కంటే ఎక్కువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : అమెరికాపై కెనడా తీవ్ర ఆగ్రహం.. భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు

ఇరాన్‌ తో యుద్ధం వల్ల ఇంధన రవాణాలో ఆటంకాలు ఏర్పడి, హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. దీంతో డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం, యుద్ధానికి ముందు గాలన్‌కు $3.81గా ఉన్న జాతీయ సగటు డీజిల్ ధర ఇప్పుడు దాదాపు $5.45కు చేరడం ఆందోళన కలిగించే అంశం. “ఇరాన్ యుద్ధం రైతులుగా మాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టింది. రాబోయే రెండేళ్లపాటు రైతులు రూపాయి కూడా సంపాదించలేరని అంచనాకు వచ్చారు” అని నేషనల్ కార్న్ గ్రోయర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు పామ్ జాన్సన్ అభిప్రాయపడ్డారు.

అమెరికాలో పండే ప్రధాన పంటలకు కొన్నేళ్లుగా ఎదురవుతున్న కష్టాలకు తోడు ఈ తాజా సంక్షోభం మరింత నష్టం చేకూర్చింది. ఫెడరల్ ప్రభుత్వం నుండి సహాయం అందకపోతే తొమ్మిది ప్రధాన పంటల రైతులు 2026లో సుమారు $31 బిలియన్ల నష్టాన్ని చవిచూస్తారని, వచ్చే ఏడాది ఈ నష్టాలు $32 బిలియన్లకు చేరుకుంటాయని అమెరికన్ ఫార్మ్ బ్యూరో ఫెడరేషన్ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న ఉత్పత్తిదారులు ఈ ఏడాది ఎకరాకు $131, అలాగే 2027లో $167 నష్టపోతారని… సోయాబీన్ రైతులు వరుసగా $80, $138 చొప్పున నష్టపోవచ్చని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వాషింగ్టన్ (అమెరికా) చేసుకున్న వాణిజ్య వివాదాల వల్ల విదేశీ మార్కెట్లలో అమెరికా దిగుమతులకు డిమాండ్ తగ్గిందని, ముఖ్యంగా చైనాలో అమెరికన్ సోయాబీన్ల కొనుగోళ్లు పడిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు అందించిన బిలియన్ల కొద్దీ డాలర్ల సహాయం తర్వాత, జూన్ నెలలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఈ రంగానికి మరో $11 బిలియన్ల ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్‌ను కోరింది.

యుద్ధ నష్టానికి తోడు కరువు, తీవ్రమైన ఎండలు నెబ్రాస్కాతో సహా కార్న్ బెల్ట్‌లోని అనేక ప్రాంతాలలో పంటలను దెబ్బతీశాయి. వ్యాపారులు ఈ ఏడాది దిగుబడి అంచనాలను తగ్గించడంతో మొక్కజొన్న ధరలు పెరిగాయి. అదే సమయంలో సోయాబీన్, గోధుమల ధరలు కూడా పెరగడంతో, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ఖర్చులు ఫెడరల్ రిజర్వ్ నిర్దేశించుకున్న 2% లక్ష్యం కంటే ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : చైనాను తలదన్నేలా ఇండియన్ స్పేస్ సెంటర్.. ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారో తెలుసా?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.