India : పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం దేశ సమాచారాన్ని చేరవేస్తున్న దంపతుల గుట్టును ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ రట్టు చేసింది. 2024 నుంచి పాకిస్థాన్ ఏజెంట్లతో కలిసి గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్న సాహిల్ (25), అతని భార్య సమీరా (21) లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి కరాచీ, ఇస్లామాబాద్ వరకు ఈ నెట్‌వర్క్ విస్తరించినట్లు విచారణలో తేలింది. పాకిస్థాన్ హ్యాండ్లర్లు ఈ దంపతులకు నిధులు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. 2024 నుంచి 2025 మధ్య కాలంలో సాహిల్, సమీరా దంపతులు ఎనిమిది భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పంపారు. ఒక్కో సిమ్ కార్డుకు హ్యాండ్లర్లు వారికి రూ. 30,000 చొప్పున చెల్లించారు.

ఈ నంబర్లను ఉపయోగించి పాకిస్థాన్‌లో వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేశారు. ఈ ఖాతాల ద్వారా పాకిస్థాన్ ఏజెంట్లు భారతదేశంలోని వ్యక్తులను సంప్రదించి సున్నితమైన సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ఈ నంబర్లను వాడుకున్నారు. అంతేకాకుండా, సోషల్ మీడియా ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారతదేశంలోని ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్‌లతో పాక్ హ్యాండ్లర్లు సంభాషిస్తున్నట్లు తేలింది. ఆర్మీ సిబ్బంది కోర్ట్ మార్షల్ ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన వివరాలను కూడా సాహిల్ పాక్ ఏజెంట్లకు అందించినట్లు పోలీసులు గుర్తించారు. రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన వివరాలను సేకరించే లక్ష్యంతో ఈ నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

ఢిల్లీలోని స‌రాయ్ కాలే ఖాన్ ప్రాంతంలోని చంద్ బీబీ క్యాంపునకు చెందిన సాహిల్‌ను మొదట స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. అతని ఫోన్‌ను పరిశీలించగా పాకిస్థాన్ ఏజెంట్లతో చాట్స్ బయటపడ్డాయి. ఆ సమాచారం ఆధారంగా సమీరా పాత్రను గుర్తించి ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.

సాహిల్ 2024లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక పాకిస్థాన్ ఏజెంట్‌ను సంప్రదించాడు. 2022లో పరిచయమైన సమీరా ఈ పరిచయానికి సహకరించింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకున్నారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఈ దంపతులకు డబ్బు ఆశ చూపి ఈ చీకటి నెట్‌వర్క్‌లోకి లాగారు. ఢిల్లీలో లాజిస్టికల్ సపోర్ట్ అందించడంతో పాటు, కొత్తవారిని రిక్రూట్ చేయడం ఈ దంపతుల ప్రధాన బాధ్యతగా పోలీసులు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సాహిల్ ఇగ్నో (IGNOU) నుంచి బీఏ పూర్తి చేసి, కొంతకాలం లాయర్ దగ్గర పనిచేశాడు. ఎల్‌ఎల్‌బీ చేయాలని భావించిన అతను 2025 జూన్‌లో ఉద్యోగం మానేశాడు. సమీరా కేశవ్‌పురంలో స్కూల్ చదువు పూర్తి చేసి, కరస్పాండెన్స్‌లో డిగ్రీ చేసింది. అరెస్ట్ అయ్యే సమయానికి ఆమె నోయిడాలోని ఒక కాల్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఈ దంపతుల అరెస్ట్‌తో పాకిస్థాన్ గూఢచర్య నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.