Nepal :  నేపాల్‌లో వరదలు సృష్టించిన భయంకర పరిస్థితుల్లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల పాటు బురద, శిథిలాల కింద చిక్కుకున్న ఆరేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. శుక్రవారం సాయంత్రం సహాయక సిబ్బంది ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వరదల్లో చిక్కుకున్న వారిని వెతుకుతున్న సిబ్బందికి ఈ ఘటన కొత్త ఆశను కలిగించింది.

రాసువా జిల్లాలోని టిమురే గ్రామంలో ఈ ఘటన జరిగింది. భోటే కోషి నదిలో నీరు ఒక్కసారిగా పెరగడంతో గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఇళ్లు, రోడ్లు, ఇతర ప్రాంతాలు బురద, శిథిలాలతో నిండిపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (APF) సిబ్బంది గాలిస్తుండగా.. మట్టిలో నుంచి చాలా చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. వెంటనే సిబ్బంది ఆ ప్రాంతంలో తవ్వడం మొదలుపెట్టారు. కొంతసేపటి తర్వాత బాలిక కనిపించడంతో ఆమెను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు.

బయటకు తీసుకొచ్చిన తర్వాత టిమురేలోని APF బోర్డర్ పోస్టులో బాలికకు మొదట చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే కాఠ్మాండూకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రమే హెలికాప్టర్‌లో ఆమెను కాఠ్మాండూకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వాతావరణం సరిగా లేకపోవడంతో, మబ్బులు ఎక్కువగా ఉండటంతో హెలికాప్టర్ వెళ్లడం ఆలస్యమైంది.

అప్పటి వరకు బాలిక పరిస్థితి మరింత దిగజారకుండా సహాయక సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం వాతావరణం కాస్త మెరుగుపడటంతో హెలికాప్టర్‌లో ఆమెను కాఠ్మాండూలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు ప్రత్యేక వైద్యం అందుతోంది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.