
Donald Trump :ఇరాన్, అమెరికా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అయితే ఇరాన్ ను అంతర్జాతీయ వేదిక మీదా దోషికి నిలిపేందుకు ట్రంప్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఇరాన్ పై సంచలన ఆరోపణలు చేశాడు.ఇరాన్ ప్రభుత్వం లక్ష మందికి పైగా ఆందోళన కారులను హత్య చేసిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. లక్ష మరణాలకు బాధ్యులైన ఇరాన్ నాయకత్వంపై యుద్ధ నేరాల కింద విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో ఇరాన్ పై పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ను ‘విఫల దేశం’గా అభివర్ణించారు
ఇరాన్యుద్ధంలో పూర్తిగా నష్టపోయిందన్నారు. ఆ దేశానికి నౌకాదళం, వైమానిక దళం, కరెన్సీ లేవని తేల్చి చెప్పారు. సైనికులు, పోలీసులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఆ దేశంలో ద్రవ్యోల్బణం 300 శాతంగా ఉందని ట్రంప్ వివరించారు. ఇరాన్ అధికారికంగా ఒక ‘విఫల దేశం’గా మారిందని ట్రంప్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దేశ నాయకత్వం పూర్తిగా గందరగోళంలో పడిందన్నారు. దేశాన్ని సక్రమంగా నడిపించే పరిస్థితిలో అక్కడి నాయకత్వం లేదని ఆయన ఆరోపించారు.
ఇరాన్ తన దేశంలో యుద్ధం వద్దని కోరుతూ ఆందోళనలు చేస్తున్న నిరసనకారులను చంపుతోందని ఆరోపించారు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా నిరసన కారులు మరణించారని ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటూ యుద్ధ నేరాలపై విచారణ చేపట్టాలన్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలూ లేవు. లక్ష మంది నిరసనకారులు ఇరాన్లో మరణించారన్న ఆరోపణను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు లేదా స్వతంత్ర పరిశీలకులు ఇంతవరకు ధ్రువీకరించలేదు.









