Rally Del Paraguay : ప్రపంచ రాలీ ఛాంపియన్‌షిప్ (WRC3)లో తెలంగాణకు చెందిన భారత రాలీ జోడీ నవీన్ పులిగిళ్ల, కో-డ్రైవర్ మూసా షరీఫ్‌లు మరోసారి సత్తా చాటారు. రాలీ డెల్ పరాగ్వేలో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, అద్భుత ప్రదర్శనతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుని మూడు పోడియంలు సాధించడం విశేషం.

ఆదివారం ముగిసిన ఎఫ్‌ఐఏ వరల్డ్ రాలీ ఛాంపియన్‌షిప్ 11వ రౌండ్ ‘రాలీ డెల్ పరాగ్వే’ డబ్ల్యూఆర్‌సీ3 విభాగంలో ఈ భారత జోడీ రేసులో చరిత్ర సృష్టించింది. గత గురువారం నుంచి ఈ నెల 30 వరకు జరిగిన ఈ రేస్‌లో డ్యూరాన్‌ రేసింగ్‌ తరఫున ఫోర్డ్‌ ఫియెస్టా ర్యాలీ-3 కారులో తన తోటి డ్రైవర్‌ ముసా షరీఫ్‌తో కలిసి నవీన్‌ బరిలోకి దిగాడు. ఇద్దరూ తీవ్రంగా శ్రమించి మూడో స్థానంలో నిలిచారు. దీంతో వీరు హ్యాట్రిక్ డబ్ల్యూఆర్‌సీ3 పోడియంలను తమ ఖాతాలో వేసుకున్నట్లయింది. ఇటీవల రవాండా మౌంటైన్‌ గొరిల్లా ర్యాలీలో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న ఈ జోడీ డ్యూరాన్ రేసింగ్ తరఫున బరిలోకి దిగింది. నవంబర్ 2025లో జరిగిన ‘రాలీ సౌదీ అరేబియా’లో కూడా వీరు రెండో స్థానంలో నిలిచారు. ఆ పోటీలో నవీన్ WRC క్లాస్ పోడియం సాధించిన తొలి భారతీయ డ్రైవర్‌గా, అలాగే మూసాతో కలిసి ఈ ఘనత సాధించిన తొలి ఆల్-ఇండియన్ డ్రైవర్-కో-డ్రైవర్ జోడీగా చరిత్ర సృష్టించడం విశేషం. ఆ తర్వాత మార్చి 2026లో ‘సఫారీ రాలీ కెన్యా’లోనూ వీరు మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

Also Read : లక్షల్లో జీతం, H-1B వీసా ఉన్నా అమెరికాను వదిలేసింది .. ఎందుకంటే?

ఈ సీజన్‌లో తమ రెండో డబ్ల్యూఆర్‌సీ రాలీలో పాల్గొన్న హైదరాబాద్‌కు చెందిన నవీన్, కాసర్‌గోడ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన కో-డ్రైవర్ మూసా షరీఫ్‌లు ఫోర్డ్ ఫియస్టా రాలీ3 కారులో ఈ రేసును పూర్తి చేశారు. 357.64 కిలోమీటర్ల సుదీర్ఘ ఎర్రమట్టి రేసింగ్‌ ట్రాక్‌పై సాగిన 22 కఠినమైన ఎర్రటి గ్రావెల్ స్పెషల్ స్టేజెస్‌లో వీరు పోటీపడ్డారు. పెనాల్టీ సమయాన్ని కలుపుకుని వీరు 5 గంటల 10 నిమిషాల 54.9 సెకన్లలో రాలీని ముగించారు. మొత్తం వివిధ విభాగాల నుండి 58 కార్లు ఈ పోటీలో పాల్గొనగా కేవలం 44 కార్లు మాత్రమే రేసును పూర్తి చేయగలిగాయి.

శుక్రవారం జరిగిన స్పెషల్ స్టేజ్ 3లో భారత జోడీ కారు రహదారి నుండి పక్కకు తప్పుకోవడంతో 6 స్టేజెస్‌ను కోల్పోయి భారీ పెనాల్టీలకు గురి కావలసి వచ్చింది. దీంతో రేసు వీరి చేతుల నుండి జారిపోయినట్లే అనిపించింది. అయితే శనివారం స్టేజ్ 10 నుండి నవీన్, మూసాలు పట్టుదలతో పుంజుకుని వరుసగా మెరుగైన టైమింగ్స్‌తో డబ్ల్యూఆర్‌సీ3 వర్గీకరణలో పైకి ఎగబాకడం గమనార్హం. టర్బో మార్పు కారణంగా మరో 15 నిమిషాల పెనాల్టీ పడినప్పటికీ, వీరు ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగారు. ఆదివారం నాటి స్వల్ప వ్యవధి స్పెషల్ స్టేజ్ 20లో నవీన్ మెరుపు వేగంతో దూసుకెళ్లగా, ముగింపు స్టేజ్ అయిన SS22 లో డబ్ల్యూఆర్‌సీ3 విభాగంలో రెండో స్థానంలో నిలిచి బలమైన ముగింపునిచ్చారు. బొలీవియాకు చెందిన నాథనియల్ బ్రూన్, ఆయన కో-డ్రైవర్ మారియో జేవియర్ జోడీ ఈ విభాగంలో విజేతగా నిలవగా, భారత జోడీ వారి తర్వాతి స్థానాల్లో నిలిచింది.

“ఈ ఫలితం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, మేము దృష్టి మరల్చకుండా చివరి వరకు పోరాడాం. పోడియంపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఎంతో గర్వకారణంగా ఉంది” అని ఆశ్యా గ్రూప్, యులా గ్లోబస్‌ల మద్దతుతో బరిలో నిలిచిన నవీన్ వ్యాఖ్యానించారు.

ఎనిమిది సార్లు ఇండియన్ నేషనల్ రాలీ కో-డ్రైవర్ ఛాంపియన్‌గా, 35 ఏళ్ల అనుభవంతో 350కి పైగా రాలీలు పూర్తి చేసిన మూసా షరీఫ్ మాట్లాడుతూ.. “సౌదీ అరేబియా ఎడారుల నుండి, కెన్యాలోని కఠినమైన భూభాగాలు, ఇప్పుడు పరాగ్వేలోని మెత్తటి గ్రావెల్ వరకు.. ప్రతి రాలీ మమ్మల్ని భిన్నంగా పరీక్షించింది. ఈ స్థాయిలో వరుసగా మూడు పోడియంలు సాధించడం చాలా ప్రత్యేకమైనది” అని పేర్కొన్నారు.

నవీన్ 2024లో న్యూజిలాండ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ రాలీ ఛాంపియన్‌షిప్‌తో అంతర్జాతీయ పోటీల్లో అరంగేట్రం చేశారు. ఆపై 2025లో రాలీ కెన్యాలో మూసాతో కలిసి డబ్ల్యూఆర్‌సీ వేదికపైకి అడుగుపెట్టారు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, సమ్వీర్ గ్రూప్‌ల మద్దతు కలిగి ఉన్న ఈ జోడీ, సెప్టెంబర్ 10 నుండి 13, 2026 వరకు జరగనున్న ఎఫ్‌ఐఏ వరల్డ్ రాలీ ఛాంపియన్‌షిప్ 12వ రౌండ్ ‘రాలీ చిలీ’పై ఇప్పుడు దృష్టి సారించనుంది. ప్రస్తుత గెలుపుతో మంచి ఫామ్‌లో ఉన్న ఈ జోడి చిలీలోనూ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : సింధు జలాలపై కోర్టు తీర్పు.. దానికి ఆ పరిధిలేదన్న భారత్…

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.