CEO : అయోధ్య రామ మందిరాన్ని నిర్వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు తొలి సీఈఓను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసింది. వారి పేర్లను ట్రస్ట్‌కు అందజేసింది. ఈ ముగ్గురిలో ఒకరిని బుధవారం జరిగే సమావేశంలో ట్రస్ట్ ఖరారు చేసే అవకాశం ఉంది. రామ మందిరంలో భక్తులు ఇచ్చే విరాళాల విషయంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలు రావడంతో ట్రస్ట్‌లో కీలక మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా సీఈఓ పదవిని ఏర్పాటు చేశారు. ఈ ఆరోపణల తర్వాత ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు.

జూలై 6న ట్రస్ట్ కొత్త పరిపాలనా మార్పులను ప్రకటించింది. ట్రస్ట్ పనులను మరింత పద్ధతిగా నిర్వహించడం, నిధులపై పర్యవేక్షణ పెంచడం, ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం కోసం సీఈఓ పదవిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సీఈఓ బాధ్యతలు, ముఖ్యంగా ట్రస్ట్ నిధుల నిర్వహణపై ఆయనకు ఉండే పర్యవేక్షణ గురించి స్పష్టత వచ్చేలా నిబంధనల్లో కూడా మార్పులు చేయాలని ట్రస్ట్ ఆలోచిస్తోంది. సీఈఓను ఎంపిక చేసేందుకు రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వీ.కే. చతుర్వేది, శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ హవారేతో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

జూలైలో అర్హత నిబంధనలు ఖరారు చేసిన తర్వాత ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆలయ నిర్వహణలో అనుభవం ఉండటంతో పాటు “దృఢమైన హిందువు” అయి ఉండాలనే నిబంధన కూడా పెట్టారు. జూలై 18న దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఆ తర్వాత ఆగస్టు మొదటి వారంలో ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో 16 మందిని ఎంపిక చేసి ఆగస్టు 11, 12 తేదీల్లో అయోధ్యకు పిలిపించి నేరుగా మాట్లాడారు.

మొత్తం 5,585 దరఖాస్తులను పరిశీలించినట్లు ఎంపిక కమిటీ కార్యదర్శి సమీర్ పాండా తెలిపారు. దరఖాస్తులను పరిశీలించేందుకు AI టూల్స్‌తో పాటు సిబ్బంది స్వయంగా కూడా పరిశీలన చేశారని చెప్పారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణే, ఒడిశాలోని సంబల్‌పూర్ కేంద్రాల్లోని బృందాలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయని తెలిపారు. చివరికి ఎంపిక చేసిన ముగ్గురి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉందో కమిటీ చెప్పలేదు. ఎంపిక కమిటీ తన తుది నివేదికను ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి, మహంత్ దినేంద్ర దాస్, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్, అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి పాల్గొన్న సమావేశంలో సమర్పించింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.