Gold Prices
Gold Prices

అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదొడుకులు, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో నెదర్లాండ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడాలో నెదర్లాండ్స్ ఉంచిన దాదాపు 86 టన్నుల బంగారాన్ని(Gold) లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు తరలించింది. బిలియన్ల డాలర్ల విలువైన ఈ పుత్తడిని సురక్షితంగా చేర్చేందుకు డచ్ సెంట్రల్ బ్యాంక్ నెలల తరబడి రహస్యంగా ఒక భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది.

ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ గోల్డ్ షిఫ్టింగ్ ప్రక్రియ సాగింది. అమెరికా, కెనడా బ్యాంకుల నుంచి తొలుత 27 టన్నుల పసిడిని నెదర్లాండ్స్ తరలించి.. అక్కడి నుంచి లండన్ చేర్చారు. మిగిలిన బంగారాన్ని నేరుగా తరలించడంలో సమస్యలు ఉండటంతో భయంతో ఓ పథకం వేశారు. న్యూయార్క్‌లో ఉన్న పసిడిని అక్కడే విక్రయించి ఆ సొమ్ముతో లండన్ మార్కెట్‌లో తిరిగి బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేశారు.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక, రాజకీయ వేదికపై తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తుండటంతో పరస్పరం భారీగా సుంకాలు విధించుకుంటున్నాయి. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచ వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొనడంతో డచ్ సెంట్రల్ బ్యాంక్ ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

Also Read : ఉబర్‌లో లేఆఫ్‌లు.. 3,300 మంది ఉద్యోగులు ఔట్‌ ?

ప్రపంచంలోనే అత్యంత పెద్ద పసిడి మార్కెట్ లండన్. అక్కడ బంగారాన్ని అమ్మడం, కొనడం లేదా తాకట్టు పెట్టి తక్షణ నిధులు పొందడం చాలా సులభం. లండన్‌లోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్‌లో ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్’ వాల్ట్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనది. ఇది బాంబు దాడులను కూడా తట్టుకోగలదు. దొంగలు డ్రిల్ చేసుకుని లోపలికి వెళ్లడం అసాధ్యం. భూగోళంపై ఉన్న మొత్తం బంగారంలో ఐదవ వంతు ఈ ఒక్క వాల్ట్‌లోనే భద్రపరిచి ఉంది. ఇందులో 90 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30కి పైగా దేశాల సెంట్రల్ బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలదే.

అత్యవసర సమయంలో లేదా దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు జరిపేటప్పుడు బంగారాన్ని భౌతికంగా ఒక దేశం నుంచి మరో దేశానికి మోసుకెళ్లాల్సిన పనిలేదు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్‌లో ఒక దేశపు అర నుంచి మరో దేశపు అరలోకి సిబ్బంది బంగారాన్ని మార్చితే సరిపోతుంది. ప్రపంచంలో ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదురైతే, లండన్‌లో ఉన్న ఈ నిల్వల ద్వారా చాలా వేగంగా ట్రేడింగ్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చనే ఉద్దేశంతోనే నెదర్లాండ్స్ ఈ మాస్టర్ ప్లాన్ అమల్లోకి తెచ్చింది.

ఇక్కడ బంగారం నిల్వ ఉంచడం వల్ల దేశాల మధ్య వర్తక, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం ఎంతో సులువవుతుంది. ఒక దేశం మరొక దేశానికి బంగారాన్ని బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు, దాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి విమానాల్లోనో, నౌకల్లోనో మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. వాల్ట్‌లోని ఒక దేశానికి చెందిన లాకర్ నుంచి మరో దేశపు లాకర్‌లోకి సిబ్బంది ఆ పసిడి కడ్డీలను మార్చేస్తే చాలు.. క్షణాల్లో తరలింపు పూర్తయిపోతుంది.

Also Read : ఇరాన్‌లో పెళ్లి వేడుకపై అమెరికా క్షిపణి దాడి.. చిన్నారి సహా నలుగురు మృతి!