
Nepal Tunnel : నేపాల్‌లో సంభవించిన జలప్రళయం చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ వరదల్లో ఎందరో ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా త్రిశూల్ 3A హైడ్రోపవర్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులు ఏకంగా 9 రోజుల తర్వాత ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. సంజయ్ షా, కబీర్ మహార్జన్ అనే ఇద్దరు కార్మికులను రెస్క్యూ బృందాలు శ్రమించి కాపాడాయి. సుమారు 170 మీటర్ల లోతులో చీకటిలో తొమ్మిది రోజుల పాటు గడిపిన ఈ ఇద్దరినీ రెస్క్యూ టీమ్ బయటకు తీసుకువచ్చింది. ప్రస్తుతం వీరిలో ఒకరికి స్వల్ప గాయాలవ్వగా.. మరొకరు నడవలేని స్థితిలో ఉన్నారు. దీంతో తక్షణమే వారిద్దరినీ అత్యవసర వైద్య చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
Also Read : ఫోక్స్‌వ్యాగన్ ఉద్యోగులకు బిగ్ షాక్.. లక్ష మందిపై వేటు.. కారణమిదే!
Two men FOUND ALIVE in Nepal hydropower tunnel NINE days after devastating flood
Rescuers clap and cheer pic.twitter.com/iTL1DIWrR3
— RT (@RT_com) September 4, 2026
ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగిసినప్పటికీ టన్నెల్ లోపల ఇంకా పలువురు కార్మికులు చిక్కుకుని ఉన్నట్లు సమాచారం అందుతోంది. లోపల ఉన్న బాధితుల ఆర్తనాథాలు, కేకలు బయటకు స్పష్టంగా వినిపిస్తున్నాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా లోపల ఉన్నవారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. “ఎవరూ భయపడవద్దు, మిమ్మల్ని కాపాడేందుకు మేము వస్తున్నాము” అంటూ సిబ్బంది వారికి ధైర్యం చెబుతున్నారు. మార్గానికి అడ్డుగా పడిన భారీ మట్టి గుట్టలు, కఠినమైన బండరాళ్లను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్‌ను రాత్రింబవళ్లు కొనసాగిస్తున్నారు. ఈ ఒక్క టన్నెల్‌లోనే ఇంకా 40 మందికి పైగా సిబ్బంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Also Read : నేను బెదిరిస్తే భయపడను.. పాతబస్తీలో సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సం నేపాల్‌ను అతలాకుతలం చేసింది. వర్షాలు, వరదల దాడికి దాదాపు 12 హైడ్రోపవర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 900 మందికి పైగా కార్మికులు, స్థానికులు గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 500 మంది వరకు వేర్వేరు టన్నెళ్లలో చిక్కుకుపోయి ఉంటారని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండటంతో నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి.
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని పొరుగు దేశాలు కూడా సహాయక హస్తాన్ని అందించాయి. భారత్, చైనా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన నిపుణులైన రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, హెలికాప్టర్లు, ప్రత్యేక పరికరాల సహాయంతో ప్రతి టన్నెల్‌లోనూ గాలిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన పెరుగుతున్నప్పటికీ.. 9 రోజుల తర్వాత ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడటం వల్ల మిగిలిన వారి కుటుంబ సభ్యులలో, రెస్క్యూ సిబ్బందిలో ఆశలు చిగురించాయి.









