73rd Miss World 2026 : 73వ ‘మిస్ వరల్డ్-2026’ కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ సొంతం చేసుకున్నారు. అందం, తెలివితో పాటు సమాజం పట్ల ఆమెకున్న అంకితభావాన్ని గుర్తించిన న్యాయనిర్ణేతలు ఈ అత్యున్నత పురస్కారాన్ని ఆమెకు అందించారు. గత ఏడాది విజేత థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ జోహెరీకి ఈ కిరీటాన్ని ధరించారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి రన్నరప్‌గా నిలవగా.. మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండవ రన్నరప్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

మిస్ వరల్డ్ పోటీల్లో కేవలం బాహ్య సౌందర్యమే కాకుండా.. అభ్యర్థుల సామాజిక దృక్పథానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ విభాగంలో జోహెరీ మోలా చెప్పిన వివరాలు ఆమె చేస్తున్న సేవలు న్యాయనిర్ణేతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు ఆంగ్ల భాషను నేర్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె వివరించారు. నేటి ప్రపంచంలో ఆంగ్ల భాష అనేది పిల్లల భవిష్యత్తుకు ఎన్నో అవకాశాల తలుపులు తీస్తుందని, విద్య ద్వారానే పిల్లలు తమ భావాలను వ్యక్తపరచడంతో పాటు లక్ష్యాలను సాధించే ఆత్మవిశ్వాసాన్ని పొందుతారని ఆమె తెలిపారు.

మిస్ వరల్డ్ సంస్థ జోహెరీని ఒక అంకితభావం కలిగిన విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా కొనియాడింది. ఆమె ‘యూనివర్సిడాడ్ ఇబెరోఅమెరికానా’ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక ‘వాయిసెస్ ఆఫ్ టుమారో’ అనే సంస్థను స్థాపించి, పేద పిల్లలకు, యువతకు ఉచితంగా ఆంగ్ల విద్యను అందించడం ప్రారంభించారు. కేవలం భాషను మాత్రమే కాకుండా ఆంగ్ల సాహిత్యం, సామాజిక శాస్త్రాలను బోధిస్తూ పిల్లల్లో విమర్శనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందిస్తున్నారు.

Also Read : హోర్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా యుద్దనౌకలపై ఇరాన్ క్షిపణుల దాడి!

ఈ పోటీలో భారతదేశం తరఫున ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2024’ విజేత నికితా పొర్వాల్ పాల్గొని మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా టాప్ 40 మంది జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ టాప్ 20 రేసులోకి చేరుకోలేకపోయారు. నికితా పొర్వాల్‌కి కళారంగంలో విశేషమైన అనుభవం ఉంది. టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె నాటకరంగంలోకి అడుగుపెట్టి 60కి పైగా నాటకాల్లో నటించారు. అంతేకాకుండా ‘కృష్ణ లీల’ పేరుతో 250 పేజీల సుదీర్ఘ నాటక పుస్తకాన్ని కూడా ఆమె రచించారు.

ప్రపంచంలోనే పురాతనమైన ఈ అందాల పోటీ 1951లో ప్రారంభమైంది. 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ పోటీలు నిర్వహించలేదు. అందువల్ల 2026లో జరిగిన పోటీ సంఖ్య ఆధారంగా ఇది 73వ ఎడిషన్ అయినప్పటికీ సంస్థ ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయినందున మిస్ వరల్డ్ సంస్థ 75వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.

వచ్చే ఏడాది జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలలో భారత్ తరఫున 19 ఏళ్ల న్యాయ విద్యార్థిని కజియా లిజ్ మెజో పోటీ పడనున్నారు. ఈమె 2026 ఆగస్టు 25న ‘మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్‌ను గెలుచుకున్నారు.

Also Read : నేపాల్ లో కొనసాగుతున్న రెస్క్యూ.. 11 రోజుల తర్వాత సజీవంగా 64 ఏళ్ళ వృద్దురాలు