NASA Invites ISRO to Join Moon Base
NASA Invites ISRO to Join Moon Base

NASA – ISRO : ఒకప్పుడు చంద్రుడిపై అడుగుపెట్టడమే మానవాళి కల.. కానీ ఇప్పుడు లక్ష్యం మారుతోంది. చంద్రుడిపైకి వెళ్లాలి.. అక్కడ పరిశోధనలు చేయాలి.. అవసరమైతే అక్కడే ఎక్కువ కాలం ఉండాలి.. ఆ తర్వాత అక్కడి నుంచి మార్స్ వైపు ప్రయాణించాలి! . ఇందుకోసం అమెరికాకు చెందిన నాసా మూన్ బేస్ ప్రోగ్రామ్ (Moon Base Programme) పేరుతో మరోసారి చంద్రునిపైకి మానవులను పంపించేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే అమెరికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రుడిపై మా పక్కన భారత్ కూడా ఉండాలి అంటూ బహిరంగంగా పిలుపునిచ్చింది. ISROను తన మూన్ బేస్ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించింది. అంతేకాదు.. భారత్‌తో తమ అంతరిక్ష బంధం ఇక కేవలం సహకారానికి పరిమితం కాదని.. కలిసి టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా వెళ్తున్నామని చెప్పింది. అసలు ఈ మూన్ బేస్ ప్రోగ్రామ్ ఏంటి? భారత్‌కు వచ్చిన ఈ ఆహ్వానం ఎందుకు అంత కీలకం? ఇందులో ISRO ఏం చేయబోతోంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బెంగళూరులో జరుగుతున్న బెంగళూరు అంతరిక్ష ప్రదర్శన 2026 వేదికగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సెప్టెంబర్ 7న ఆయన మాట్లాడుతూ.. NASA అధికారికంగా ISROను మూన్ బేస్ ప్రోగ్రామ్‌లో చేరాలని ఆహ్వానించిందని వెల్లడించారు. “మేం చంద్రుడిపైకి తిరిగి వెళ్తున్నాం.. చంద్రుడిపై మా పక్కన భారత్ ఉండాలని కోరుకుంటున్నాం” అన్న సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇచ్చారు.

అంతకుముందే ఆగస్టు 5, 6 తేదీల్లో బెంగళూరులో జరిగిన 9వ భారతదేశం-అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కూడా NASA, ISROను మూన్ బేస్ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించింది. అంటే ఇది కేవలం ఒక వేదికపై చేసిన పొలిటికల్ కామెంట్ కాదు.. ఇరు దేశాల అంతరిక్ష చర్చల్లో అధికారికంగా వచ్చిన ప్రతిపాదన.

ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. NASA మూన్ బేస్ ప్రోగ్రామ్‌లో భారత్ ఇప్పటికే భాగస్వామి అయిపోయిందని కాదు. NASA నుంచి ISROకు అధికారిక ఆహ్వానం వచ్చింది. ఈ ఆహ్వానం ఆధారంగా భవిష్యత్ సహకారం, టెక్నాలజీ, శాస్త్రీయ ప్రయోగాలు, డేటా షేరింగ్ వంటి అంశాలపై చర్చలు ముందుకు వెళ్లనున్నాయి. 2025లో భారత ప్రభుత్వం కూడా.. ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది. కానీ NASA నేతృత్వంలోని ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో అధికారిక మిషన్ భాగస్వామి కాలేదు. కేవలం భవిష్యత్తులో భాగస్వామ్య అవకాశాలను పరిశీలిస్తామని మాత్రమే భారత్ చెప్పింది. ఇప్పుడు వచ్చిన మూన్ బేస్ ఇన్విటేషన్ మాత్రం ఆ దిశలో మరో కీలక అడుగుగా చూడొచ్చు.

Also Read : నేపాల్ సీన్ రిపీట్.. జపాన్‌లో జలప్రళయం

మూన్ బేస్ ప్రోగ్రామ్‌ అనేది చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం ఉండేందుకు అవసరమైన స్థావరాలు, మౌలిక వసతుల అభివృద్ధి చేసే కార్యక్రమం. ఇది NASA చేపడుతున్న ఆర్టెమిస్ ప్రొగ్రామ్‌తో లింక్ అయి ఉంది. అంటే ఇక్కడ అమెరికా లక్ష్యం కేవలం మరోసారి చంద్రుడిపై మనిషిని దింపడం కాదు. చంద్రుడిపై శాస్త్రీయ పరిశోధనలు, దీర్ఘకాలిక కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం.. భవిష్యత్తులో అంగారకుడిపై మానవ మిషన్లకు చంద్రుడిని ఒక స్టెప్పింగ్ స్టోన్‌గా ఉపయోగించడం ఆర్టెమిస్ ప్రణాళికలో కీలక భాగం. NASAకు చెందిన ఆర్టెమిస్ ఒప్పందాలు మాత్రం ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్‌వర్క్. అంతరిక్ష అన్వేషణ శాంతియుతంగా, బాధ్యతాయుతంగా జరగడానికి దేశాల మధ్య కొన్ని సూత్రాలను ఏర్పాటు చేసే ఒప్పంద వ్యవస్థ ఇది. భారత్ 2023లో ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసి 27వ దేశంగా చేరింది.

చంద్రుడిపై స్థావరం ఎందుకు అంత ముఖ్యమంటే.. భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణం కోసం చంద్రుడు ఒక టెస్టింగ్ గ్రౌండ్‌గా మారే అవకాశం ఉంది. అక్కడి వాతావరణం, ధూళి, భూభౌతిక పరిస్థితులు, నీటి మంచు వంటి వనరులను అధ్యయనం చేయడం కీలకం. ముఖ్యంగా చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో నీటి మంచు ఉంటే.. భవిష్యత్తులో దాన్ని తాగునీరు, ఆక్సిజన్ లేదా రాకెట్ ఇంధనానికి అవసరమైన వనరులుగా ఉపయోగించే అవకాశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. NASA కూడా చంద్రుడు, అంగారకుడు, గ్రహశకలాలపై వనరుల వినియోగం భవిష్యత్ అంతరిక్ష అన్వేషణకు కీలకమని ఆర్టెమిస్ ఒప్పందాలలో పేర్కొంది.

ఇలాంటి భారీ ప్రాజెక్టులో అమెరికా.. భారత్‌ను ఎందుకు కోరుకుంటోంది? దీనికి ప్రధాన కారణం ISRO సామర్థ్యం. చంద్రయాన్-3 ద్వారా భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధించి ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చూపించింది. అంతేకాదు.. భారత్ తక్కువ ఖర్చుతో క్లిష్టమైన అంతరిక్ష మిషన్లను నిర్వహించగలదనే గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు అమెరికా, భారత్ మధ్య సహకారం కేవలం రాకెట్లు లేదా ఉపగ్రహాల వరకే పరిమితం కాకుండా మానవ అంతరిక్షయానం, శాస్త్రీయ పరికరాలు, డేటా పంచుకోవడం, స్టార్టప్‌లు వంటి రంగాలకు విస్తరిస్తోంది.

Also Read : అమెరికా ఓటర్లకు ట్రంప్ భారీ ఆఫర్.. ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతీ పౌరుడికి రూ.4 లక్షలు

ఇప్పటికే దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ నైజార్. NASA-ISRO సింథటిక్ అపెర్చర్ రాడార్ అనే ఈ శాటిలైట్‌ను భారత్, అమెరికా కలిసి అభివృద్ధి చేశాయి. 2025 జూలై 30న GSLV ద్వారా నైజార్‌ను ప్రయోగించారు. భూమి ఉపరితలంలో వచ్చే సూక్ష్మ మార్పులు, భూకంపాలు, కొండచరియలు, వరదలు, హిమ ప్రాంతాల మార్పులు, వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల వంటి వాటిని అధ్యయనం చేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది. అంటే అంతరిక్షంలో కలిసి పనిచేసే భారత్-అమెరికా భాగస్వామ్యం.. ఇప్పటికే భూమిపై మనుషుల జీవితాలకు ఉపయోగపడే స్థాయికి వచ్చింది.

ఇక మరో కీలక అంశం మానవ అంతరిక్ష ప్రయాణం. 2025లో భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా Axiom-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లారు. 18 రోజుల పాటు ISSలో ఉండి ఏడు మైక్రోగ్రావిటీ ప్రయోగాలు నిర్వహించారు. ఈ మిషన్‌లో NASAతో భారత్‌కు ఉన్న సహకారం మరింత బలపడింది. భారత గగన్‌యాన్ వ్యోమగాముల శిక్షణ, భవిష్యత్ మానవ అంతరిక్షయాన సాంకేతికతల విషయంలో కూడా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

ఇక ఇప్పుడు అమెరికా ఇచ్చిన ఈ ఆహ్వానం వల్ల మరో కొత్త అవకాశం తెరుచుకుంటోంది. భారత్‌కు చంద్రుడిపై భవిష్యత్ పరిశోధనల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించొచ్చు. చంద్రుడి ఉపరితలంపై పరిశోధన, రోబోటిక్స్, సైంటిఫిక్ పరికరాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, చంద్రుని డేటా పంచుకోవడం వంటి రంగాల్లో ISROతో కలిసి పనిచేసే అవకాశాలు పెరగొచ్చు. అయితే ఇందులో ఏ మిషన్‌లో భారత్ ఏ బాధ్యత తీసుకుంటుంది? ఎంత స్థాయిలో సాంకేతిక సహకారం ఉంటుంది? ఏ పరికరాలు లేదా ప్రయోగాలను భారత్ అందిస్తుంది? వంటి వివరాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి.

అంతేకాదు.. అమెరికా కేవలం ISROనే కాదు.. భారత అంతరిక్ష స్టార్టప్‌లను కూడా తమ ఎకోసిస్టమ్‌లోకి ఆహ్వానిస్తోంది. బెంగళూరు అంతరిక్ష ప్రదర్శనలో సెర్గియో గోర్ మాట్లాడుతూ అమెరికా మార్కెట్ భారత అంతరిక్ష స్టార్టప్‌లకు తెరిచి ఉందని, అమెరికన్ పెట్టుబడిదారులు భారత అంతరిక్ష వ్యాపారులపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అంటే భవిష్యత్ అంతరిక్ష పోటీలో ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాదు.. ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి.

ఇక్కడే భారత్‌కు మరో పెద్ద ప్రయోజనం ఉంది. భారత్ ఇప్పటికే స్పేస్ విజన్ 2047 కింద చంద్రయాన్ కార్యక్రమాలు, గగన్‌యాన్ కొనసాగింపు, భారత అంతరిక్ష కేంద్రం వంటి లక్ష్యాలపై దృష్టి పెట్టింది. మరోవైపు అమెరికా చంద్రుడి నుంచి మార్స్ వరకు విస్తరించే దీర్ఘకాలిక మానవ అంతరిక్ష అన్వేషణకు సిద్ధమవుతోంది. ఈ రెండు లక్ష్యాలు కలిసే చోటే భారత్-అమెరికా అంతరిక్ష భాగస్వామ్యంకు భారీ అవకాశం ఏర్పడుతోంది.

ఒకప్పుడు అమెరికా-రష్యా అంతరిక్ష పోటీని ప్రపంచం చూసింది. ఇప్పుడు కొత్త అంతరిక్ష యుగంలో అమెరికా, భారత్ వంటి దేశాలు కలిసి చంద్రుడి వైపు అడుగులు వేస్తున్నాయి. చంద్రుడిపైకి భారత్ ఒంటరిగా వెళ్లడం ఒక విషయం.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అంతరిక్ష సంస్థ NASAతో కలిసి వెళ్లడం మరో విషయం. చంద్ర స్థావరం నుంచి మార్స్ మిషన్ వరకు.. రాబోయే దశాబ్దాల్లో మానవాళి అంతరిక్ష ప్రయాణంలో భారత్ పాత్ర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చివరగా ఒక్క మాట.. చంద్రుడిపై మనిషి మరోసారి అడుగుపెట్టబోతున్నాడు. కానీ ఈసారి అది కేవలం “వెళ్లి రావడం” కోసం కాదు.. అక్కడే భవిష్యత్తుకు పునాది వేయడం కోసం. ఆ భవిష్యత్తు ప్రయాణంలో భారత్ కూడా ఉండాలని అమెరికా కోరుకుంటోంది. NASA ఆహ్వానం.. ISRO సామర్థ్యం.. ఆర్టెమిస్ లక్ష్యం.. ఈ మూడు కలిస్తే చంద్రుడిపై భారత జెండాకు మరోసారి కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.