
Chander Agarwal :ప్రేమలో ఉన్నపుడు ప్రియురాలు ఏం అడిగిన కాదనకుండా ప్రియుడు కొనిస్తాడు. చివరికి తన వద్ద డబ్బులు లేకున్నా అప్పులు చేసైన ఆమె కోరికలు తీరుస్తాడు. కానీ, అవసరం తీరిన తర్వాత ఆ ప్రియురాలు హ్యాండిస్తే..కొంతమంది ప్రియులు ఉన్మాదులుగా మారుతున్నారు. మరికొంతమంది దేవదాసులుగా మారుతున్నారు. అయితే భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ప్రేమలో మునిగితేలినపుడు తన కోసం ఖర్చుచేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడం ఆసక్తిగా మారింది.
వివరాల ప్రకారం భారతీయ మూలాలున్న లాజిస్టిక్స్ సంస్థ ‘టిసిఐ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్’ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చందర్ అగర్వాల్ కొంతకాలం క్రితం ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆ సమయంలో ఆమెకోసం దాదాపు 3,70,000 డాలర్లు (సుమారు రూ. 3.5 కోట్లు) ఖర్చు చేశాడు. అయితే ఇటీవల తన ప్రియురాలు ఫెలీషియా లీతో చందర్ కు బ్రేకప్ అయింది. దీంతో ఆమె కోసం ఖర్చుచేసిన మొత్తాన్ని ఇప్పించాలని కోరుతూ సింగపూర్ హైకోర్టులో కేసు వేయడం సంచలనంగా మారింది. తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆమె కోసం చేసిన ఖర్చులన్నీ వడ్డీ లేని రుణాలుగా ఇచ్చానని, ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని ఆయన కోర్టును ఆశ్రయించడం విశేషం. అయితే, ఆ ఖర్చులన్నీ ఆమెమీద ప్రేమతో ఇచ్చిన కానుకలే తప్ప రుణాలు కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ సందర్భంగా తమ ప్రేమకథ ఎలా మొదలైందనే విషయాన్ని కూడా ఆయన కోర్టుకు విన్నవించాడు. చందర్ అగర్వాల్, ఫెలీషియా లీలు మొదటిసారిగా 2019లో ఒక విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. అపుడు మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2022లో వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. అయితే డిసెంబర్ 2023 నాటికి ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో ఇద్దరూ విడిపోయారు. అయితే ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో హెర్మ్స్, డియోర్, ప్రాడా వంటి విలాసవంతమైన బ్రాండెడ్ వస్తువులు, ఫస్ట్-క్లాస్ విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనలు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, స్టాన్ఫోర్డ్-ఎన్యుఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఫీజులతో పాటు తన క్రెడిట్ కార్డ్‌ల ద్వారా భారీగా లీ కోసం ఖర్చు చేసినట్లు ఆయన వివరించాడు. చివరకు లీ ఫ్లాట్ కోసం ఫెంగ్ షూయ్ మాస్టర్‌కు సుమారు 17,000 సింగపూర్ డాలర్లు కూడా చెల్లించినట్లు వెల్లడించాడు. ఒక భారతీయుడిగా తనకు ఫెంగ్ షూయ్పై నమ్మకం లేదని, కాబట్టి ఆ మొత్తాన్ని రుణంగానే భావించాలని అగర్వాల్ కోర్టులో వాదించాడు. అయితే ఆ సేవలను స్వయంగా అగర్వాలే తన లవర్ కోసం ఏర్పాటు చేశారని పేర్కొంటూ న్యాయమూర్తి ఆయన వాదనను తోసిపుచ్చారు.
అయితే ఆమె విజ్ఞప్తి మేరకే ఈ డబ్బును అప్పుగా ఇచ్చానని అగర్వాల్ వాదించారు. వాటిని తిరిగి చెల్లిస్తానని ఆమె సంతకం చేసిన చేతిరాత ఒప్పందం కూడా తన వద్ద ఉందని అగర్వాల్ కోర్టుకు విన్నవించారు. అయితే లీ ఆ సంతకాన్ని నిరాకరించింది. అదే సమయంలో వీరిద్దరి మధ్య వేలాది వాట్సాప్ మెసేజ్‌ల సంభాషణలు ఉన్నప్పటికీ, ఎక్కడా కూడా డబ్బును అప్పుగా కోరినట్లుగానీ, తిరిగి ఇస్తానని అంగీకరించినట్లుగానీ బలమైన ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది. అగర్వాలే స్వయంగా ఆమెపై ప్రేమతో నిరంతరం ఖరీదైన కానుకలు ఇచ్చినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని బెంచ్ నిర్ధారించింది. దాంతో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా, లీకి అయిన న్యాయపరమైన ఖర్చులను కూడా అగర్వాలే చెల్లించాలని ఆదేశించడం కొసమెరుపు.









