
UK:ప్రపంచంలో ఇప్పటికే ఉన్న దేశాలకు తోడు మరికొన్ని దేశాలు కొత్తగా అవతరించనున్నాయి. ఇప్పటివరకు అగ్రదేశాల పాలనలో ఉన్న కొన్ని దేశాలు స్వాతంత్ర్య దేశాలుగా మారాలని కోరుకుంటున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) భారీ షాక్ ఇచ్చేందుకు మూడు దేశాలు సిద్ధమయ్యాయి. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాలని గట్టిగా కోరుకుంటున్న స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల అధినేతలు యూకే నుంచి వేరు పడాలనుకుంటున్నారు. దీనికోసం వారు వేల్స్ రాజధాని కార్డిఫ్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ పరిణామం యూకే విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తు్న్నారు. రాజ్యాంగ మార్పుల ప్రక్రియకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు, మూడు దేశాల సమన్వయాన్ని పెంపొందించుకునేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు దేశాలలోనూ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం కోరుకునే ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలే అధికారంలో ఉండడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది.
కాగా, లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంతాల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆ దేశాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ, వేల్స్ ఫస్ట్ మినిస్టర్ రన్ అప్ ఐయర్వర్త్, ప్రొ-ఇండిపెండెన్స్ పార్టీ అయిన సిన్ ఫెయిన్ వైస్ ప్రెసిడెంట్ మిషెల్ ఓ నీల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ ప్రాంతాల భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు అక్కడి ప్రజలకే ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ అధికార లేబర్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఈ ప్రాంతాలలో జాతీయవాద పార్టీలు బలోపేతమయ్యాయి. వేల్స్‌లో ప్లాయిడ్ సిమ్రు పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఉత్తర ఐర్లాండ్‌లో సిన్ ఫెయిన్ పార్టీ ఇప్పటికే అధికార పగ్గాలు చేపట్టడం గమనార్హం. స్కాట్లాండ్‌లో స్కాటిష్ నేషనల్ పార్టీ అత్యంత బలమైన శక్తిగా ఎదిగింది. దీంతో ఈ మూడు ప్రాంతీయ ప్రభుత్వాల కలయికతో యూకే సమాఖ్య వ్యవస్థకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది.
ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఈ వేర్పాటు ఉద్యమానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఆయన అభిప్రాయం ప్రకారం స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లలో ప్రజాభిప్రాయంలో స్పష్టమైన మార్పు వస్తే రెండోసారి స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరపవచ్చని బర్న్‌హామ్ వెల్లడించడమే దీనికి కారణం. దీనిపై దుమారం రేగడంతో ఆ తర్వాత ప్రధాని కార్యాలయం ఈ వ్యాఖ్యలను సరిదిద్ది, స్కాట్లాండ్ స్వాతంత్ర్యం చర్చే తమ పరిధిలో లేదని ప్రకటించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భవిష్యత్తులో ఐర్లాండ్ దేశం ఒకటి కావడం ఖాయమని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఎంతమాత్రం కొనసాగే అవకాశం లేదని, యూకే విచ్ఛిన్నం తర్వాత ఏర్పడే పోస్ట్-యూకే భవిష్యత్తుకు లండన్ పాలకులు సన్నద్ధం కావాలని స్కాటిష్ నేత జాన్ స్విన్నీ గట్టిగా హెచ్చరించారు. ఈ మూడు స్వతంత్ర దేశాల నాయకుల బంధం బ్రిటన్ సమగ్రతను ప్రపంచ మ్యాప్ నుంచి తుడిచేసే దిశగా సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.









