
India’s 100% Tariff : రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం టారిఫ్‌లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుపై యూఎస్ హౌస్ ఓటు వేయడానికి సిద్ధమైంది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యాలాంటి దేశాలపై వంద శాతం సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం దక్కే అవకాశం ఉంటుంది. టారిఫ్‌లు విధించే అవకాశం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉండటం గమనార్హం. ‘లిండ్సే ఓ గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ గా వ్యవహరించే ఈ బిల్లును 86-11 ఓటుతో యూఎస్ సెనేట్ ఇదివరకే ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి వీలు కల్పిస్తుంది. అంతేకాదు రష్యా, ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించేందుకూ రూపొందించబడింది.
Also Read : సౌదీపై హౌతీల దాడులు.. మక్కాలో తొలిసారి వైమానిక హెచ్చరికలు..
భారత్‌పై బిల్లు ప్రభావం ఎంత?
నిజానికి ఈ బిల్లును యూఎస్ హౌస్ ఆమోదించినంత మాత్రాన భారతీయ సరుకులపై ఆటోమేటిక్‌గా 100 శాతం సుంకాలు పడవు. కానీ, రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనే దేశాలపైనా అలాగే రష్యాపై ఉన్న ఆంక్షలను తప్పించే దేశాలపై వంద శాతం సుంకాలు విధించేందుకు మాత్రమే అధ్యక్షుడికి అధికారం ఉంటుంది. అలాంటి పది దేశాల జాబితాను డెమోక్రటిక్ ప్రతినిధి స్టీని హోయర్ తయారు చేశారు. అలాంటి దేశాల్లో ఇండియా, చైనా, యూఏఈ, తుర్కియే, అజర్బైజాన్, హంగేరి, సింగపూర్, కజకస్తాన్, కిర్గిస్తాన్, ద స్లోవాక్ రిపబ్లిక్ తదితర దేశాలున్నాయి. కాగా.. హోయర్ అమెండ్మెంట్ను యూఎస్ హౌస్ రూల్స్ కమిటీ పూర్తిగా అడాప్ట్ చేయలేదు. ఈ సవరణకు వ్యతిరేకంగా కమిటీ 3-7తో ఓటు వేసింది. అందువల్ల భారత్‌ను అలాంటి దేశాల జాబితాలో చేర్చినప్పటికీ ఈ టారిఫ్‌లను ఆమోదించినట్లుగానీ, విధించినట్లుగానీ భావించలేం.
సెనేట్ ఆమోదించిన బిల్లులో ఏముంది?
కాగా, సెనేట్ ఆమోదించిన బిల్లులో భారత్ లేదా హౌస్ సవరణలో పేర్కొన్న ఇతర దేశాల పేర్లను ప్రత్యేకంగాఎక్కడ ప్రస్తావించలేదు. అయితే, రష్యా నుంచి అత్యధిక పరిమాణంలో చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకునే ఐదు దేశాలకు మాత్రం వర్తించేలా విస్తృత విధానాన్ని ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇందులో రష్యా నాయకత్వం, ఆ దేశ ఇంధన ఆదాయాలు, అలాగే ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగించే నౌకలను లక్ష్యంగా చేసుకునే చర్యలు కూడా ఉన్నాయి. అలాగే ఇరాన్‌పై ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : AIకి కిల్ స్విచ్.. ప్రమాదం వస్తే పూర్తిగా ఆపేయాల్సిందేనా?
మరో సవరణ..
అయితే ఈ సుంకాల నిబంధనలపై అమెరికా ప్రతినిధుల సభలో కొంత వ్యతిరేకత కూడా వచ్చింది. అందులో అధ్యక్షుడికి ద్వితీయ సుంకాలు విధించే విస్తృత అధికారాన్ని కల్పించే సెక్షన్‌ను తొలగించాలంటూ ప్రతినిధి గ్రెగరీ మీక్స్తో పాటు పలువురు డెమోక్రటిక్ సభ్యులు సవరణను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సవరణను హౌస్ రూల్స్ కమిటీ తిరస్కరించింది. దీనిపై ఓటింగ్‌లో 3-7 తేడాతో సవరణను సభలో చర్చకు తీసుకురావడానికి మాత్రం అనుమతించలేదు. అనంతరం, బిల్లును పరిశీలించేందుకు సంబంధించిన నిబంధనను 7-3 ఓట్లతో కమిటీ ఆమోదించింది.









