UNHRC : గత కొంతకాలంగా ఇరాన్‌పై దాడులు నిర్వహిస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఆ దేశంలో అనేక యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) నియమించిన అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం ఈ విషయమై నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇరాన్‌పై అమెరికా జరిపిన రెండు దాడుల్లో అగ్రరాజ్యం యుద్ధ నేరాలకు పాల్పడిందని చెప్పేందుకు తగిన ఆధారాలు లభించాయని నిజనిర్ధారణ బృందం తెలిపింది. ఈ రెండు దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 178 మంది మృతి చెందినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. నిజానికి ఇరాన్‌ పై అమెరికా అనేక దాడులు చేసినప్పటికీ నిజనిర్ధారణ బృందం రెండు ఘటనలను ప్రస్తావించింది. ఆ రెండు ఘటనల్లో ఒకటి.. మినాబ్‌లోని పాఠశాలపై తోమహాక్‌ క్షిపణి దాడి చేసిన సందర్భం, మరొకటి లామెర్డ్‌ నగరంలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, నివాస ప్రాంతంపై జరిగిన వైమానిక దాడి. ఈ రెండు దాడుల్లోనూ అమెరికా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. అదేవిధంగా ఇరాన్‌లో భద్రతా బలగాలూ తీవ్రమైన మారణకాండకు పాల్పడ్డాయని నిజనిర్ధారణ బృందం ఆరోపించింది.

Also Read : ఇరాన్, అమెరికా యుద్ధంలో కీలక పరిణామం… అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్‌లో ఒకవైపు, సొంత ప్రభుత్వమే హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుండటం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేస్తుండటం.. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం.. ఈ రెండింటి మధ్య అక్కడి పౌరులు నలిగిపోతున్నారని ఆ సంస్థ తెలిపింది. కాగా, ఈ నివేదిక ఇరాన్‌ యుద్ధంలో జరిగిన నేరాల గురించి సేకరించిన అంతర్జాతీయ ఆధారాలను మరింత బలపరిచింది. తద్వారా, అంతర్జాతీయ న్యాయస్థానాలలో న్యాయం సాధించేందుకు ఇది ఉపయోగపడనుంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన సమయంలో మినాబ్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని ఐఆర్‌జీసీ స్థావరాలపై అమెరికా దాడులు చేస్తున్న సమయంలో మినాబ్‌లోని ఓ పాఠశాలపై క్షిపణి పడింది. ఈ ఘటనలో 168 మంది మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మరోవైపు.. లామెర్డ్‌పై దాడికి తాము బాధ్యులం కాదని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ఇదివరకే ఖండించింది. ఏది ఏమైనప్పటికీ అమెరికా సృష్టించిన ఈ మారణకాండపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

Also Read : భారత్‌పై నూరుశాతం సుంకాలు… రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల బిల్లుకు ఆమోదం..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.