
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ప్రపంచాన్ని ఏలాలని చూస్తున్న అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. రక్షణ రంగంలో కొత్త విప్లవం తేవాలని భావించి, ఏఐ ఆధారిత సిస్టమ్‌లపై అతిగా ఆధారపడటం ఎంతటి దారుణానికి దారితీస్తుందో ఇరాన్‌లోని మినాబ్ పాఠశాలపై జరిగిన క్షిపణి దాడి నిరూపించింది. ఇటీవల అమెరికా సైన్యం ఇరాన్‌లోని ఒక స్థావరంపై రెండు శక్తివంతమైన ‘టోమాహాక్’ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. కానీ తీరా ఆ బాంబులు పడింది సైనిక స్థావరంపై కాదు.. ‘షజరే తయ్యేబే’ అనే ప్రాథమిక పాఠశాలపై పడ్డాయి. ఈ దాడిలో పాఠశాలలో ఉన్న 123 మంది అమాయక చిన్న పిల్లలతో పాటు మొత్తం 150 మందికి పైగా పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘోరంపై పెంటగాన్ జరిపిన దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి. అమెరికా బాంబులు వేయడానికి చాలా సంవత్సరాల ముందే ఆ స్థానంలో పాఠశాల ఉందనే విషయం తమ రికార్డుల్లో నమోదైంది. 2017 ఉపగ్రహ చిత్రాల్లోనే ఆ స్థావరం చుట్టూ కాంపౌండ్ వాల్స్ వచ్చి పాఠశాల వేరుగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. 2018 రికార్డుల్లో ప్రకాశవంతమైన రంగుల గోడలు, చిన్న ఫుట్‌బాల్ మైదానం, పిల్లల ఆట గుర్తులు బయటపడ్డాయి. చివరకు 2019లోనే ఒక అమెరికన్ నిఘా విశ్లేషకుడు ఈ మార్పును గమనించి ఆ ప్రాంతం పాఠశాలగా మారిందని డిజిటల్ సిస్టమ్‌లో నమోదు చేశారు. అయితే ఇక్కడే పెద్ద పొరపాటు జరిగింది. ఆ విశ్లేషకుడు వివరాలు నమోదు చేసిన సిస్టమ్‌కు, బాంబు దాడుల లక్ష్యాలను ఖరారు చేసే ‘ప్రధాన మిలిటరీ డేటాబేస్’తో అనుసంధానం లేదు. దాంతో ఆ విశ్లేషకుడు ఇచ్చిన సమాచారం దాడులు ప్లాన్ చేసే అధికారులకు ఎప్పటికీ చేరలేదు. తర్వాత సంవత్సరాల్లో కూడా పాత రికార్డులనే నమ్మి అది సైనిక స్థావరమేనని తీవ్రంగా పొరపడ్డారు.
ఈ దాడుల సమయంలో అమెరికా సైన్యం పాలంటిర్ మేవెన్ అనే స్మార్ట్ ఏఐ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది. ఇది వేర్వేరు సమాచారాలను విశ్లేషించి దాడులకు లక్ష్యాలను సిద్ధం చేస్తుంది. దాడి ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే ఏకంగా 1,000 కంటే ఎక్కువ ప్రాంతాలపై విరుచుకుపడ్డారు. ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో అధికారులు సమాచారాన్ని సరిచూసుకునే సమయం లేకపోయింది. సిస్టమ్‌లోని పాత తప్పులను ఈ ఏఐ సాఫ్ట్వేర్ పట్టుకుంటుందని అధికారులు గుడ్డిగా నమ్మేశారు. కానీ లోపల ఉన్న డేటానే తప్పుగా ఉన్నప్పుడు ఏఐ కూడా తప్పుడు ఫలితాన్నే ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి కమిటీ కూడా దీనిపై విచారణ జరిపి ఇది పక్కాగా అమెరికా చేసిన యుద్ధ నేరం కిందకే వస్తుందని తేల్చింది.









