Apple Layoffs : ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రభావం, ఇతర కారణాలతో ప్రముఖ టెక్‌ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ మరోసారి ఉద్యోగాల కోతకు రెడీ అయింది. ఈ కంపెనీ ఇదివరకే మొదటి రౌండ్‌లో పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించగా, రెండవరౌండ్‌లో మరికొందరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ ఉద్యోగులను తొలగించడం రెండు నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. కాగా ఆపిల్‌ ఈసారి తమ ఫిట్‌నెస్ ప్లస్ టీమ్‌పై చర్యలకు దిగింది. ఈ టీమ్‌లోని కొందరు ఉద్యోగులను తొలగించినట్లు ‘బ్లూమ్‌బెర్గ్‌’ తన నివేదికలో స్పష్టం చేసింది. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Also Read : PTIకి బిగ్ షాక్.. ఇమ్రాన్ ఖాన్ సోదరి అరెస్ట్

గత వారం జరిగిన ఈ తొలగింపుల ప్రభావం ప్రధానంగా ఫిట్‌నెస్ ప్లస్ ఆడియో ఫీచర్లపై పనిచేస్తున్న సిబ్బందిపై పడినట్లు తెలుస్తోంది. ‘టైమ్ టు వాక్’, ‘టైమ్ టు రన్’ వంటి ఆడియో గైడెడ్ వర్క్‌అవుట్‌లను తయారు చేసే టీమ్‌లోని ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ల ద్వారా యాపిల్ వాచ్ వినియోగించే వినియోగదారులు వీడియో చూడాల్సిన అవసరం లేకుండానే ఆడియో సూచనలతో వ్యాయామాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విభాగంలో కోతల వల్ల భవిష్యత్తులో కొత్త ఆడియో కంటెంట్ విడుదల తగ్గే అవకాశం ఉన్నప్పటికీ , ఈ ఫీచర్లను మాత్రం పూర్తిగా నిలిపివేయడం లేదని ఆపిల్‌ తన నివేదికలో స్పష్టం చేసింది.

కాగా, ఆపిల్‌ తీసుకుంటున్న ఈ చర్యలు మరిన్ని ఖర్చు తగ్గింపు చర్యలకు, సర్వీస్‌లో పెద్ద మార్పులకు సంకేతంగా ఫిట్‌నెస్ ప్లస్ విభాగంలోని ఇతర ఉద్యోగులు భావిస్తున్నారు. అంతేకాక, భవిష్యత్తులో ఫిట్‌నెస్ ప్లస్ సేవలను ఆపిల్ హెల్త్ యాప్‌లో విలీనం చేస్తారేమోననే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా, గత నెల (ఆగస్టు 2026)లో కూడా ఆపిల్ సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. సిరి, విజన్ ప్రో, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ఎక్స్‌పీరియన్స్ (ఏఐ ఫీచర్లకు సంబంధించిన యూనిట్) వంటి విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 200 మందిపై వేటు పడింది. ‘వినియోగదారులకు మెరుగైన అనుభవాలు అందించేందుకే ఈ మార్పులు చేస్తున్నామని’ అప్పుడు ఆపిల్ ప్రకటించింది. ప్రస్తుతం టెక్ రంగంలోని అనేక కంపెనీలు కూడా పునర్‌వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆపిల్ నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తాజా ఉద్యోగాల కోతపై ఆపిల్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read : తమిళనాడులో మరో రాజకీయపార్టీ… హీరో అజిత్‌ కార్యదర్శిగా టీఎంకే ?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.