Farmer Registry : తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ర్టంలోని రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీలో వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని తేల్చి చెప్పింది. దీనివల్ల రైతులకు ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు సులభంగా అందించేందుకు వీలవుతుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదు చేసుకున్న ప్రతి రైతుకు ప్రత్యేకమైన ఫార్మర్‌ ఐడీ లభిస్తుంది.

నిజానికి ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదు విషయం ఇంతకు ముందే ప్రకటించినప్పటికీ చాలామంది ఇప్పటికీ నమోదు చేయించుకోలేదు. దీంతో ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ గ్రామాల్లో ప్రత్యేక ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దానికోసం అధికారులు గ్రామాల్లోకి వచ్చి రైతుల రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అక్కడే రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) వద్ద లేదా మీ సేవ కేంద్రంలోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

అయితే ఇప్పటికే పలువురు ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నవారు ఉన్నారు. ఆ రైతులు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత వచ్చే ఫార్మర్‌ ఐడీ నంబర్‌ను మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పీఎం కిసాన్‌, రైతు భరోసా వంటి పథకాలకు ఈ ఐడీ ఎంతో అవసరం అవుతుంది.

Also Read : ఎల్పీజీ సబ్సిడీ కొనసాగాలంటే ఆధార్‌తో లింక్ తప్పనిసరి.. ఇంట్లో నుండే ఇలా చేసుకోండి..

రిజిస్ట్రేషన్‌ కోసం ఏం కావాలి?

కాగా, రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీలో తమ పేరు నమోదు చేసుకోవడానికి ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ ఉండాలి. వీటిని తీసుకెళ్లి నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఫార్మర్‌ ఐడీ ఎందుకోసమంటే?

రైతులకు ఇపుడు ఈ ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. ఫార్మర్‌ ఐడీ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, సేవలు, రాయితీలు, సబ్సిడీలు పొందేందుకు ఉపకరిస్తుంది. బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఎరువుల బుకింగ్‌కు ఉపయోగించే ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ యాప్‌లోనూ ఇది అవసరమవుతుంది. వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కనీస మద్దతు ధర పొందే ప్రక్రియలోనూ ఫార్మర్‌ ఐడీ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

Also Read : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు… భక్తి పారవశ్యంలో మునిగిన జనం

ఫార్మర్‌ ఐడీ ఎలా తెలుసుకోవాలి?

కాగా, ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులు తమ ఫార్మర్‌ ఐడీని ఆన్‌లైన్‌లో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ముందుగా ఫార్మర్‌ రిజిస్ట్రీ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం ఆధార్‌ నంబర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాలి. ఆధార్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేస్తే మీ ఫార్మర్‌ ఐడీ నంబర్‌ స్క్రీన్‌పై కనపడుతుంది. ఈ విషయాన్ని గుర్తించి ఇప్పటికీ నమోదు చేసుకోని రైతులు వెంటనే స్పందించి సెప్టెంబర్‌ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.