Bihar : బిహార్‌లోని జముయి జిల్లాలో 10వ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికను కొందరు వ్యక్తులు అడ్డుకుని వేధించిన ఘటన కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 19న కోచింగ్‌ నుంచి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఇద్దరు విద్యార్థులు జముయిలోని మడ్వా పహాడ్ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. స్కూటర్‌ ఆపించి ఇద్దరినీ కిందకు దిగాలని చెప్పారు. ఆ తర్వాత బాలుడిని కొట్టడం, అతని చొక్కా కాలర్ పట్టుకోవడం, బాలికను వేధించడం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనను అక్కడున్న వారిలో కొందరు మొబైల్‌లో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : దేశ రాజధానిలో దారుణం.. మైనర్‌పై గ్యాంగ్‌రేప్‌.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

వీడియోలో బాలుడు, బాలిక తమను వదిలేయాలని పదేపదే కోరుతున్నట్లు కనిపిస్తోంది. బాలుడి కాలర్ పట్టుకుని లాగడంతో అతను తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బాలికను కూడా ఓ వ్యక్తి పట్టుకుని లాగినట్లు వీడియోలో కనిపిస్తోంది. బాలుడు వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి అడ్డుకున్నాడు.

ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినా ఆ వ్యక్తులు వారిని వెంటాడారు. స్కూటర్‌పై వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో కూడా బాలికను చేతితో పట్టుకుని లాగినట్లు వీడియోలో కనిపించింది. చివరకు ఇద్దరూ తమను వదిలేయాలని వేడుకున్నారు.

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జముయి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటన సెప్టెంబర్ 19న సాయంత్రం సమయంలో జరిగినట్లు జముయి పోలీసులు తెలిపారు. వీడియోలో ఆరుగురు నుంచి ఏడుగురు వరకు వ్యక్తులు కనిపిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోక్సో చట్టంతో పాటు ఇతర చట్టాల కింద కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Also Read : హరిబాబు హత్యకేసులో బిగ్‌ట్విస్ట్‌… తానే చంపానని వైష్ణవి సోదరుడి వీడియో విడుదల

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.