
Xi-Jinping : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకవైపు ఆయా దేశాలపై వాణిజ్య పన్నులు విధిస్తూనే మరోవైపు ఆ దేశాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే భారత్, చైనా దేశాలపై 100 శాతం పన్నులు విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆందోళనలు వ్యక్తమవుతుండగానే తాజాగా చైనాతో చర్చలు సాగించే పనిలో పడ్డాడు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ నెల 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చల కోసం ఆయన ఆ దేశానికి పయనమవుతున్నారు. కాగా, గడచిన ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ ఏడాది మే నెలలో ట్రంప్ బీజింగ్ లో పర్యటించిన ట్రంప్ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇక తాజాగా చైనా అధ్యక్షుడి పర్యటన ఇరుదేశాల మధ్య చెప్పుకోదగ్గ మైలురాయిలా చరిత్రలో నిలిచిపోతుందని చైనా పేర్కొనడం గమనార్హం. ట్రంప్ ఆహ్వానం మేరకే జిన్‌పింగ్ అమెరికాకు వెళ్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు బీజింగ్‌లో మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరు దేశాల సంబంధాలతోపాటు ప్రపంచ శాంతి, సుస్థిరతలపై లోతైన చర్చలు జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు.
Also Read : టార్గెట్ ఇమ్రాన్‌ఖాన్.. పాక్‌లో ముసుగు వ్యక్తుల దాడి, మంత్రి కిడ్నాప్; వీధుల్లోకి PTI..
ఇరు దేశాలు సహకారాన్ని బలోపేతం చేసుకుని రెండు దేశాల ప్రజలకు గొప్ప లబ్ధి చేకూరేలా, తద్వారా ప్రపంచానికి మేలు జరిగేలా చర్చలు సాగనున్నాయని ప్రతినిధి వివరించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలకడానికి.. అరుదైన రీతిలో విమానాశ్రయానికి ట్రంప్ స్వయంగా రానున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య సుంకాలు, ఏఐ, సైన్యాల మధ్య సహకారం,సాంకేతికత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతరిక్షంలో ఆయుధ పోటీ, పశ్చిమాసియా ఘర్షణలు వంటి పలు అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న కారణంతో చైనా, భారత్ వంటి దేశాలపై 100% వాణిజ్య సుంకాలు విధించే ఆంక్షల చట్టాన్ని ట్రంప్ ఇటీవలే తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగనున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : PTIకి బిగ్ షాక్.. ఇమ్రాన్ ఖాన్ సోదరి అరెస్ట్









